కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తత

ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దుల్లో గురువారం ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. రెండు దేశాలకు చెందిన యుద్ధవిమానాలు పోటాపోటీగా గాల్లో చక్కర్లు కొట్టాయి.

Published : 07 Oct 2022 05:20 IST

గాల్లోకి ఎగిరిన రెండు  దేశాల యుద్ధ విమానాలు
రెండు ఖండాంతర క్షిపణులనూ  ప్రయోగించిన ఉత్తర కొరియా

సియోల్‌: ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దుల్లో గురువారం ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. రెండు దేశాలకు చెందిన యుద్ధవిమానాలు పోటాపోటీగా గాల్లో చక్కర్లు కొట్టాయి. చివరకు ఏ విధమైన ఘర్షణ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కవ్వింపు చర్యల్లో భాగంగా ఉత్తర కొరియా గురువారం రెండు ఖండాంతర క్షిపణులను తన తూర్పు జలాల్లో ప్రయోగించింది. దీంతోపాటు సరిహద్దుల్లో 12 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టించింది. వీటిలో ఎనిమిది ఫైటర్‌ జెట్లు, నాలుగు బాంబర్లు ఉన్నాయి. వెంటనే దక్షిణ కొరియా కూడా 30 ఫైటర్‌ జెట్లను మరికొన్ని యుద్ధ విమానాలను బదులుగా పంపింది. కొద్దిసేపటి తరువాత అవి వాటి వాటి స్థావరాలకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చల్లబడింది. కొరియా ద్వీపకల్పం-జపాన్‌ మధ్య 22 నిమిషాల తేడాలో క్షిపణుల ప్రయోగం నిర్వహించారని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల జపాన్‌ మీదుగా అణు క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించిన నేపథ్యంలో కొరియా ద్వీపకల్పం సమీపంలోని జలాల్లో యుద్ధవిమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌ను అమెరికా తిరిగి మోహరించింది. ఈ నేపథ్యంలో ప్యాంగ్యాంగ్‌ క్షిపణుల ప్రయోగం జరపడం గమనార్హం. కాగా ఉత్తర కొరియా మంగళవారం నాటి క్షిపణి ప్రయోగానికి ప్రతిగా దక్షిణ కొరియా బుధవారం చేపట్టిన మిస్సైల్‌ ప్రయోగం విఫలం అయ్యింది. గాంగ్నెయుంగ్‌ నగరంలోని ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌లో హ్యూమూ-2 క్షిపణిని ప్రయోగించిన కొద్దిసేపటికే నేల కూలిందని, ఈ సందర్భంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

అణ్వాయుధ సంపత్తి బలోపేతమే లక్ష్యం

అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ దేశ అణ్వాయుధ సంపత్తిని బలోపేతం చేసే దిశగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నట్లు తాజా క్షిపణి ప్రయోగాలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతిమంగా అణ్వాయుధ దేశంగా అమెరికా గుర్తింపు పొందడం, తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయించడమే కిమ్‌ లక్ష్యమని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

రష్యా, చైనాలపై అమెరికా ఆగ్రహం

ఉత్తరకొరియా క్షిపణి పరీక్షల విషయం వెలుగులోకి రాగానే దక్షిణ కొరియా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది. కవ్వింపు చర్యలకు బలమైన ప్రతిస్పందన ఉంటుందని ప్యాంగ్యాంగ్‌ను హెచ్చరించింది. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఉ.కొరియా చర్యలకు రష్యా, చైనాల నుంచి లభిస్తున్న రక్షణే కారణమని అమెరికా నిందించింది. జపాన్‌పై నుంచి క్షిపణి పరీక్షకు ప్రతిస్పందనగా బుధవారం జపాన్‌-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో పాటు భారత్‌ కూడా గట్టిగా ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని