బ్రిటన్‌ యుద్ధ విమానాల మాజీ పైలట్లకు చైనా వల!

చైనా నుంచి తమ దేశ భద్రతకు ముంచుకొస్తున్న ముప్పుపై బ్రిటన్‌ ఆలస్యంగా కన్ను తెరించింది. రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌)కు చెందిన యుద్ధ విమానాల మాజీ పైలట్లను డ్రాగన్‌ భారీగా నియమించుకుంటున్నట్లు తెలియడంతో అప్రమత్తమైంది.

Updated : 19 Oct 2022 05:50 IST

పీఎల్‌ఏ శిక్షణకు భారీ ప్యాకేజీలు

అప్రమత్తమైన బ్రిటన్‌ ప్రభుత్వం.. దిద్దుబాటు చర్యలు

లండన్‌: చైనా నుంచి తమ దేశ భద్రతకు ముంచుకొస్తున్న ముప్పుపై బ్రిటన్‌ ఆలస్యంగా కన్ను తెరించింది. రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌)కు చెందిన యుద్ధ విమానాల మాజీ పైలట్లను డ్రాగన్‌ భారీగా నియమించుకుంటున్నట్లు తెలియడంతో అప్రమత్తమైంది. ఇందుకోసం చైనా భారీ ప్యాకేజీలనూ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మాజీ పైలట్‌కు సుమారు రూ.2.23 కోట్ల (2.70 లక్షల డాలర్లు)ను ఇస్తోందని సమాచారం. వీరి సేవలను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి శిక్షణ ఇచ్చేందుకు వినియోగించుకుంటోంది. బ్రిటన్‌కు చెందిన ఆర్‌ఏఎఫ్‌ పైలట్లు అత్యాధునిక యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను నడపడంలో నిష్ణాతులు. వీరితో తమ సైనికులకు శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రిటన్‌, పశ్చిమ దేశాల యుద్ధ విమానాల రహస్యాలను, వ్యూహాలను తెలుసుకోవడానికి కూడా చైనా ప్రయత్నిస్తోందని నిఘా వర్గాల విశ్లేషణ. ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తుండడంతో ఇప్పటికే 30 మందికిపైగా మాజీ పైలట్లు ఆ దేశానికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆర్‌ఏఎఫ్‌తో పాటు సాయుధ దళాల సిబ్బందికీ బ్రిటన్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి నియామకాలు తమ దేశ చట్టాల ఉల్లంఘన పరిధిలోకి రానప్పటికీ అధికార రహస్యాలను కాపాడాల్సిన బాధ్యత మాజీ పైలట్లు, మాజీ సైనికులపై ఉంటుందని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో చైనా నియామకాలను అడ్డుకోవడానికి నూతన జాతీయ భద్రత బిల్లును తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తైవాన్‌తో ఉద్రిక్తతలు, ప్రపంచ పరిణామాల నేపథ్యంలో డ్రాగన్‌ మాజీ పైలట్ల నియామకాలను ముమ్మరం చేసింది. విదేశీ మాజీ పైలట్లను నేరుగా తమ దేశానికి తీసుకెళ్లడమే కాకుండా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని కొన్ని వైమానిక అకాడమీల ద్వారా కూడా చైనా రహస్య వ్యూహాలను అమలుచేస్తోందని బ్రిటన్‌ నిఘా వర్గాలు గుర్తించాయి.

బ్రిటన్‌, చైనా మధ్య మరో వివాదం
హాంకాంగ్‌ నిరసనకారుడిపై జరిగిన దాడి ఘటన బ్రిటన్‌, చైనా దేశాల మధ్య దౌత్య వివాదాన్ని రాజేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలను పురస్కరించుకుని హాంకాంగ్‌కు చెందిన నిరసనకారులు ఆదివారం బ్రిటన్‌ నగరం మాంచెస్టర్‌లోని చైనా కాన్సులేట్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు ఓ ప్రదర్శనకారుడిని కాన్సులేట్‌ ప్రాంగణం లోపలికి లాక్కెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం అభ్యంతరం తెలిపింది.  కాన్సులేట్‌ సిబ్బందిని రక్షించుకునే హక్కు తమకు ఉంటుందని పేర్కొంది. అయితే, దాడి ఘటనకు నిరసనగా బ్రిటన్‌ విదేశాంగ శాఖ లండన్‌లోని చైనా దౌత్య అధికారిని పిలిపించుకొని వివరణ కోరింది. తమ భూభాగంపై ఉద్యమకారుల గొంతును నొక్కేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీని అనుమతించబోమని బ్రిటన్‌ పార్లమెంటుకు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలు అలీసియా కియర్న్స్‌ తెలిపారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు