Rishi sunak: రిషి సునాక్‌కు పట్టం కడతారా?

మా అబ్బాయి నలుగురు ఆర్థిక మంత్రులు, ముగ్గురు హోం మంత్రులు, ఇద్దరు ప్రధాన మంత్రులు, ఓ రాణి, ఓ రాజు హయాం చూశాడు. ఇంతకూ మా వాడి వయసెంతో తెలుసా?

Updated : 21 Oct 2022 07:38 IST

మా అబ్బాయి నలుగురు ఆర్థిక మంత్రులు, ముగ్గురు హోం మంత్రులు, ఇద్దరు ప్రధాన మంత్రులు, ఓ రాణి, ఓ రాజు హయాం చూశాడు. ఇంతకూ మా వాడి వయసెంతో తెలుసా? నాలుగు నెలలు!

లండన్‌వాసి ఒకరు గురువారం మధ్యాహ్నం చేసిన ట్వీట్‌ ఇది. సాయంత్రం కల్లా ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో మరికొద్దిరోజుల్లో ఆ నాలుగు నెలల అబ్బాయి.. బ్రిటన్‌ మూడో ప్రధానిని కూడా చూడబోతున్నాడనేది స్పష్టమైంది. 2016 బ్రెగ్జిట్‌ తర్వాత ఏడేళ్లలో బ్రిటన్‌ ఐదో ప్రధానిని చూడబోతోంది. ఇంతకూ లిజ్‌ ట్రస్‌ తర్వాత బ్రిటన్‌ పగ్గాలు ఎవరు చేపడతారు? ఇప్పటికైనా ఆంగ్లేయులు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు అవకాశం ఇస్తారా? సమర్థుడైన ఆర్థిక మంత్రిగా పేరొందిన ఆయన పేరును ఆమోదిస్తారా? లేక మరొకరిని ఎంచుకుంటారా అనేది వెయ్యి పౌండ్ల ప్రశ్న!


బోరిస్‌ జాన్సన్‌ మళ్లీ సై

45 రోజుల కిందటే లిజ్‌ ట్రస్‌తో పోటీపడి ఓడిపోయిన రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని పదవి పోటీలో మళ్లీ తెరపైకి వచ్చారు. ట్రస్‌ రాజీనామా నేపథ్యంలో అందరికళ్లూ మళ్లీ సునాక్‌పై పడ్డాయి. రేసులో ఆయనే ముందంజలో ఉన్నారు. అయితే కన్జర్వేటివ్‌ పార్టీలోని అంతర్గత రాజకీయాల కారణంగా ఎవరి పేరైనా అనూహ్యంగా తెరపైకి వచ్చే అవకాశముంది. సునాక్‌తోపాటు మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారు మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ప్రస్తుత ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌, ప్రతినిధుల సభ నేత పెనీ మోర్డౌంట్‌, రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌. వీరందరిలోనూ సునాక్‌కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సాధారణంగానైతే ప్రస్తుతం బ్రిటన్‌ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, గతంలో భేషైన ఆర్థిక మంత్రిగా ప్రశంసలు అందుకున్న సునాక్‌ సరైన, ఏకైక ఎంపిక కావాలి. కానీ ఆంగ్లేయుల రాజకీయాల్లో సునాక్‌కు ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తన రాజీనామాకు కారణమైన సునాక్‌ను ప్రధానిగా చూడటానికి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సిద్ధంగా లేరు. మొన్నటి ఎన్నికల్లోనే ట్రస్‌ కంటే తొలుత రేసులో ముందంజలో ఉన్న సునాక్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. సునాక్‌పై కోపంతో ట్రస్‌కు మద్దతిచ్చారు. ఆమె గెలిచేలా చేశారు. తాజాగా మళ్లీ తానే రంగంలోకి దిగాలని ఆశపడుతున్నారు. ఒకవేళ తాను నెగ్గలేని పరిస్థితుల్లో సునాక్‌ను ఓడించటానికే జాన్సన్‌ ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2025లో జరుగుతాయి. అప్పటిదాకా మెజార్టీ ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థే ప్రధాని అవుతారు. ట్రస్‌ తర్వాతి ప్రధానిని ఎన్నుకునేది కన్జర్వేటివ్‌ పార్టీయే. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ భవితవ్యానికి ఆ పార్టీ పెద్దపీట వేస్తుందా, లేదా సంకుచిత రాజకీయాలకా అనేది మరో వారంలో తేలిపోతుంది. ఒకవేళ రిషి సునాక్‌ ప్రధానిగా ఎన్నికైతే భారత సంతతి నుంచి ఆ అవకాశం లభించిన తొలి వ్యక్తి అవుతారు.

-ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని