Long Covid: వ్యాయామంపై తొందరొద్దు!

కరోనా వ్యాప్తికి ప్రస్తుతం దాదాపుగా సంకెళ్లు పడినా.. మానవాళిపై ఆ మహమ్మారి ప్రతికూల ప్రభావాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

Updated : 07 Nov 2022 08:35 IST

లాంగ్‌ కొవిడ్‌ బాధితులు అతిగా శ్రమిస్తే అనర్థమే
హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

బర్మింగ్‌హాం: కరోనా వ్యాప్తికి ప్రస్తుతం దాదాపుగా సంకెళ్లు పడినా.. మానవాళిపై ఆ మహమ్మారి ప్రతికూల ప్రభావాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో వైరస్‌ బారిన పడ్డ అనేక మంది దీర్ఘకాలిక కొవిడ్‌ (లాంగ్‌ కొవిడ్‌)తో ఇబ్బంది పడుతున్నారు. ఆయాసం, తలనొప్పి, నిద్రలేమి, కుంగుబాటు లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి బాధితులు వ్యాయామం ద్వారా ప్రయోజనం పొందొచ్చని ఇటీవల కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఇది చాలామందికి ఉత్సాహాన్నిచ్చే విషయమే. అయితే లాంగ్‌ కొవిడ్‌ బాధితులు వ్యాయామం చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా సోకడం వల్ల తలెత్తిన పరిమితులను దృష్టిలో పెట్టుకొని.. మెల్లమెల్లగా శరీరానికి శ్రమ పెంచాలని సూచిస్తున్నారు. లాంగ్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నాక కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం...

ఒకేసారి పూర్తిస్థాయిలో వద్దు

కొవిడ్‌ సోకడానికి ముందు హాఫ్‌ మారథాన్‌లలో పాల్గొన్నవారు, ఎక్కువ శ్రమ కలిగించే వ్యాయామాలు చేసినవారు.. దాన్నుంచి కోలుకున్న వెంటనే మునుపటిలా పూర్తిస్థాయిలో వ్యాయామాలకు దిగకూడదు. ఒక్కసారిగా శ్రమ పెంచితే.. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాల తీవ్రత మరింత పెరుగుతుంది. కోలుకోవడం కష్టమవుతుంది. వైద్యులు, ఫిట్‌నెస్‌ నిపుణుల సాయంతో క్రమపద్ధతిలో వ్యాయామం చేయడం ప్రారంభించాలి.

విరామం అవసరం

ప్రతివారం వ్యాయామం తీవ్రత పెంచుకుంటూ పోవచ్చనుకోవడం సరికాదు. లాంగ్‌ కొవిడ్‌ బాధితులు కొన్నిసార్లు పరిస్థితిని బట్టి శ్రమ తగ్గించుకోవాల్సి ఉంటుంది. తమను ఎక్కువగా బాధిస్తున్న లాంగ్‌ కొవిడ్‌ లక్షణాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. వ్యాయామ సెషన్ల మధ్య తగినంత విరామం, విశ్రాంతి అవసరం. వ్యాయామ సమయంలో ఎంత అలసటకు గురవుతున్నారో ఎప్పటికప్పుడు స్వయంగా గమనించుకోవాలి. అవసరమైతే ప్రారంభంలో.. కూర్చొని చేసే చిన్న చిన్న వ్యాయామాలకే పరిమితమవ్వాలి. పరిస్థితి మెరుగయ్యాక నిలబడి శ్రమించాలి. ఆ తర్వాత నడకకు మళ్లాలి. ఇంకొన్నాళ్లయ్యాక ఎండ్యూరెన్స్‌, బలం చేకూర్చే శిక్షణలను ఎంచుకోవాలి. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు మాత్రం వ్యాయామానికి దూరంగా ఉండటమే మంచిది.

వ్యాయామంతో ప్రయోజనాలు

* ఆరోగ్యకర జీవిన విధానాన్ని పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా భవిష్యత్తులో కొవిడ్‌ సహా ఇతర వైరస్‌ల నుంచి రక్షణ దక్కుతుంది.

* ఆరోగ్యానికి హానికరమైన ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్లు వ్యాయామం, పోషకాహారం ద్వారా అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని