పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలు దొరికేనా

మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతున్న వాతావరణ సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరపడమే లక్ష్యంగా...

Published : 07 Nov 2022 05:25 IST

ఈజిప్టులో ప్రారంభమైన కాప్‌-27 సదస్సు

షర్మ్‌ ఎల్‌ షేక్‌: మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతున్న వాతావరణ సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరపడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మక కాన్ఫెరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)-27 సదస్సు ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌ పట్టణంలో ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతుండగా.. పలు దేశాల్లో ఆహార, ఇంధన సంక్షోభాలు ముంచుకొస్తున్నవేళ జరుగుతున్న ఈ సదస్సు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సోమవారం జరగనున్న ‘ప్రపంచ నేతల సదస్సు’తో కాప్‌-27లో అసలు అంకం ప్రారంభమవుతుంది. అనేక దేశాల అధినేతలు ఇందులో పాల్గొని 5 నిమిషాల చొప్పున ప్రసంగిస్తారు. పర్యావరణంలో ప్రతికూల మార్పులపై తమ తమ ప్రభుత్వాలు చేస్తున్న పోరాటాల గురించి వారు వివరిస్తారు. తాజా సదస్సు నుంచి తామేం ఆశిస్తున్నదీ చెప్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్‌-27కు హాజరవడం లేదు.

తాజా సదస్సులో భారత బృందానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షర్మ్‌ ఎల్‌ షేక్‌ చేరుకున్న ఆయన.. కాప్‌-27 వేదిక వద్ద మన దేశ పెవిలియన్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగతంగా ప్రతిఒక్కరి కృషి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (లైఫ్‌)’ పేరుతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన నిధులు, సాంకేతికత సరఫరా పెంచేలా అభివృద్ధి చెందిన దేశాలను భారత్‌ తాజా సదస్సులో డిమాండ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘కాప్‌-27’ ఈ నెల 18 వరకు కొనసాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు