Rishi Sunak: తీవ్ర ఒత్తిడిలో రిషి సునాక్‌

కన్జర్వేటివ్‌ పార్టీ సహచరుడిని దూషించిన కేసులో శాఖ ఏదీ కేటాయించని మంత్రి గవిన్‌ విలియమ్‌సన్‌ రాజీనామా చేయడంతో బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌పై ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది.

Updated : 10 Nov 2022 08:57 IST

దూషణల వివాదంలో మంత్రి రాజీనామా
ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టిన విపక్షాలు

లండన్‌: కన్జర్వేటివ్‌ పార్టీ సహచరుడిని దూషించిన కేసులో శాఖ ఏదీ కేటాయించని మంత్రి గవిన్‌ విలియమ్‌సన్‌ రాజీనామా చేయడంతో బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌పై ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది. రాజీనామా చేసిన గవిన్‌.. ప్రధాని సునాక్‌కు సన్నిహితుడు కావడమే ఇందుకు కారణం. మంత్రులను ఎన్నుకోవడంలో సునాక్‌ వైఫల్యానికి ఇది నిదర్శనమంటూ లేబర్‌ పార్టీ నేత సర్‌ కీర్‌ స్టార్మర్‌ మండిపడ్డారు. ప్రతివారం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో జరిగే ప్రధానమంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. విలియమ్‌సన్‌ ప్రవర్తన గురించిన వివాదం గత వారాంతంలో మొదలైంది. ఆయనపై ఉన్న దూషణల ఫిర్యాదు గురించి, ఆయన మంత్రిపదవి చేపట్టడానికి ఒకరోజు ముందే కన్జర్వేటివ్‌ పార్టీ ఛైర్మన్‌ జేక్‌ బెర్రీ.. కొత్త ప్రధాని రిషి సునాక్‌కు తెలిపారు. మంగళవారం రాత్రి విలియమ్‌సన్‌ రాజీనామా చేశారు. ఆయనను మంత్రిగా నియమించినందుకు పశ్చాత్తాపపడుతున్నానని రిషి సునాక్‌ అన్నారు. ప్రజాజీవితంలో నైతికత చాలా అవసరమని చెప్పారు. విలియమ్‌సన్‌ రాజీనామాను చాలా బాధతో ఆమోదిస్తున్నానని రిషి సునాక్‌ తెలిపారు. ఇన్నాళ్లూ విశ్వాసంగా ఉన్నందుకు, వ్యక్తిగతంగా మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. గత నెలలో లిజ్‌ట్రస్‌ రాజీనామా చేసిన తర్వాత బోరిస్‌ జాన్సన్‌ మళ్లీ పోటీకి రాకుండా చేయడంలో విలియమ్‌సన్‌ కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. తన గత ప్రవర్తన గురించి చెబుతున్న వివరాలను విలియమ్‌సన్‌ తన రాజీనామా లేఖలో ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు దీనివల్ల మసకబారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

టోరీ పార్టీ విప్‌ అయిన వెండీ మోర్టాన్‌కు ఆయన ఒక సందేశం పంపారని, ఎలిజబెత్‌-2 మహారాణి అంత్యక్రియల సమయంలో తనను పక్కనపెట్టడంపై అందులో తీవ్ర పదజాలం వాడారని అంటున్నారు. ‘ద సండే టైమ్స్‌’లో ఈ విషయం ప్రచురితమైంది.


అల్లుడి కోసం సుధామూర్తి పూజలు

సింధుదుర్గ్‌: తన అల్లుడు, బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ బాగుండాలని కోరుకుంటూ ప్రముఖ రచయిత్రి, దాత సుధామూర్తి మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ ఆలయంలో పూజలు చేయించారు. ముంబయికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవగఢ్‌ తాలూకాలోని ఈ దుర్గాదేవి ఆలయాన్ని బుధవారం ఉదయం ఆమె సందర్శించారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు