టిబెట్‌ పీఠభూమి నుంచి సూర్యుడిపై పరిశోధనలు

అంతరిక్ష పరిశోధనల విషయంలో చైనా క్రమంగా దూసుకుపోతోంది. చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉండిపోయే ప్రాంతాలపై పరిశోధనల నుంచి గ్రహశకలాలపైకి వ్యోమనౌకలను పంపడం వరకూ అనేక ఆలోచనలను చేస్తోంది.

Published : 15 Nov 2022 04:25 IST

భారీ టెలిస్కోపును సిద్ధం చేసిన చైనా

బీజింగ్‌: అంతరిక్ష పరిశోధనల విషయంలో చైనా క్రమంగా దూసుకుపోతోంది. చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉండిపోయే ప్రాంతాలపై పరిశోధనల నుంచి గ్రహశకలాలపైకి వ్యోమనౌకలను పంపడం వరకూ అనేక ఆలోచనలను చేస్తోంది. ఇప్పుడు సూర్యుడి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తిమంతమైన టెలిస్కోపులను సిద్ధం చేసింది.

టిబెట్‌ పీఠభూమిపై డావోచెంగ్‌ సోలార్‌ రేడియో టెలిస్కోపు (డీఎస్‌ఆర్‌టీ) నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. వచ్చే ఏడాది జూన్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే వీలుంది.    1.4 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని చైనా నిర్మించింది. దీని సాయంతో అంతరిక్షం, భూ వాతావరణంపై భానుడి ప్రభావం గురించి శోధించొచ్చు.

*  ఈ టెలిస్కోపులో 313 డిష్‌ యాంటెన్నాలు ఉంటాయి. ఒక్కోదాని వెడల్పు 6 మీటర్లు. ఇవన్నీ కలిసి ఒక భారీ టెలిస్కోపుగా ఏర్పడ్డాయి. దీని వెడల్పు 3.14 కిలోమీటర్లు. రేడియో తరంగ దైర్ఘ్యంలో ఇది సూర్యుడిని చిత్రీకరిస్తుంది.

* సూర్యుడి నుంచి అకస్మాత్తుగా వచ్చే రేడియో ధార్మిక విస్ఫోటాలను కరోనల్‌ మాస్‌ ఇజెక్షన్‌ (సీఎంఈ)లుగా పిలుస్తారు. అవి విశ్వంలో చాలా దూరం వ్యాపిస్తాయి. ఇలాంటి పరిణామాలకు దారితీసే అంశాల గురించి అర్థం చేసుకోవడానికి డావోచెంగ్‌ టెలిస్కోపు ఉపయోగపడుతుంది. భానుడిలో వస్తున్న మార్పులనూ శోధిస్తుంది.

* పెద్ద సంఖ్యలో డిష్‌లతో కూడిన భారీ టెలిస్కోపు వల్ల శక్తిమంతమైన రేణువుల నుంచి వెలువడే బలహీన సంకేతాలనూ పసిగట్టడం వీలవుతుంది. ఈ సమాచారం సాయంతో సీఎంఈల గురించి ముందస్తు హెచ్చరికలను చేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రేడియో ధార్మిక జ్వాలలు పుడమిని ఎప్పుడు తాకుతాయన్నది తెలుసుకొని, అప్రమత్తం కావొచ్చని పేర్కొన్నారు.

*  భూమిపై అతిపెద్ద పీఠభూమి కావడం వల్ల టిబెట్‌ను ఈ ప్రాజెక్టు కోసం ఎంచుకున్నట్లు పరిశోధకులు వివరించారు. అక్కడి నుంచి చాలా స్పష్టంగా ఆకాశాన్ని వీక్షించొచ్చని పేర్కొన్నారు.

*  మెరీడియన్‌ ప్రాజెక్టులో భాగంగా చైనా ఈ టెలిస్కోపు నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో మింగ్టాను ఇంటర్‌ప్లానెటరీ సింటిలేషన్‌ టెలిస్కోపు కూడా ఉంది. ఇన్నర్‌ మంగోలియాలో ఇది ఏర్పాటవుతోంది. అందులో వంద డిష్‌లు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని