మెరుగైన బంధానికి బాటలు పరుద్దాం

ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతున్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అమెరికా, చైనా తాజాగా తీర్మానించుకున్నాయి.

Published : 15 Nov 2022 04:25 IST

ఘర్షణకు తావివ్వకుండా విభేదాలను పరిష్కరించుకుందాం
ద్వైపాక్షిక భేటీలో బైడెన్‌, జిన్‌పింగ్‌ సంకల్పం

బాలి: ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతున్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అమెరికా, చైనా తాజాగా తీర్మానించుకున్నాయి. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతల కోసం కలిసికట్టుగా కృషిచేయాలని సంకల్పించుకున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. జి-20 సదస్సు కోసం ఇండోనేసియాలోని బాలికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ సోమవారం ద్వైపాక్షికంగా సమావేశమయ్యారు. బైడెన్‌ అమెరికా పాలనా పగ్గాలు చేపట్టాక వీరిద్దరూ నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని, చిరునవ్వుతో పలకరించుకున్నారు. తైవాన్‌ వివాదం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వం సహా అనేక అంశాలపై వారిద్దరు దాదాపు మూడు గంటలపాటు విస్తృతంగా చర్చించుకున్నారు. అణు యుద్ధం ఎన్నటికీ జరగకూడదని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. ఆ తరహా సమరంలో విజేతలెవరూ ఉండబోరని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో అణ్వస్త్రాల వినియోగానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

భేటీలో బైడెన్‌ మాట్లాడుతూ.. జిన్‌పింగ్‌తో సంప్రదింపుల కోసం తానెప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతానని పేర్కొన్నారు. అమెరికా, చైనా తమ మధ్య విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోగలవని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత తామిద్దరిపైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య పోటీ అనేది ఘర్షణ దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా చూడాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. పలు అంతర్జాతీయ అంశాలపై పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. షింజియాంగ్‌, టిబెట్‌, హాంకాంగ్‌లలో మానవహక్కుల ఉల్లంఘన చోటుచేసుకుంటున్నతీరును జిన్‌పింగ్‌ వద్ద బైడెన్‌ లేవనెత్తారని అమెరికా శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. తైవాన్‌ విషయంలో డ్రాగన్‌ దుందుడుకు వైఖరిని ఆయన తప్పుపట్టారని కూడా వెల్లడించింది. తైవాన్‌ ఆక్రమణకు చైనా త్వరలోనే ప్రయత్నిస్తుందని తానేమీ చెప్పడం లేదని జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం విలేకర్ల సమావేశంలో బైడెన్‌ పేర్కొన్నారు. మరోవైపు- అమెరికా అధ్యక్షుడితో సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య బంధం రెండు దేశాల్లో దేనికీ ప్రయోజనకరంగా లేదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజమూ ఇలాంటి పరిస్థితిని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అమెరికా-చైనా మధ్య సరైన, మెరుగైన బంధానికి బాటలు పరచాల్సిన బాధ్యత ఇరు దేశాల అధినేతలుగా తమపై ఉందని అన్నారు. తైవాన్‌ వ్యవహారంలో ఎర్రగీత దాటొద్దని అమెరికాకు ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని