సంక్షిప్త వార్తలు(3)

దీర్ఘకాలం ఆస్తమాతో బాధపడే పెద్దలకు హృద్రోగ, పక్షవాతం ముప్పు అధికంగా ఉండొచ్చని తాజా పరిశోధన పేర్కొంది. వీరి మెదడుకు అనుసంధానమయ్యే ప్రధాన ధమనులు మందంగా, పెళుసుగా మారుతున్నట్టు వెల్లడించింది. కొవ్వు పదార్థాలు, కణ వ్యర్థాలు, కాల్షియం, ఫిబ్రిన్‌లతో కూడిన ‘ప్లేక్‌’ వారి ధమనుల్లో పేరుకుంటుండటమే ఇందుకు కారణమని తేల్చింది.

Updated : 26 Nov 2022 05:20 IST

ఆస్తమా బాధితులకు పక్షవాతం ముప్పు

వాషింగ్టన్‌: దీర్ఘకాలం ఆస్తమాతో బాధపడే పెద్దలకు హృద్రోగ, పక్షవాతం ముప్పు అధికంగా ఉండొచ్చని తాజా పరిశోధన పేర్కొంది. వీరి మెదడుకు అనుసంధానమయ్యే ప్రధాన ధమనులు మందంగా, పెళుసుగా మారుతున్నట్టు వెల్లడించింది. కొవ్వు పదార్థాలు, కణ వ్యర్థాలు, కాల్షియం, ఫిబ్రిన్‌లతో కూడిన ‘ప్లేక్‌’ వారి ధమనుల్లో పేరుకుంటుండటమే ఇందుకు కారణమని తేల్చింది. ఇతరులతో పోల్చితే, ఆస్తమా బాధితుల్లో అంతర్గత వాపులు ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ నిపుణులు ఈ పరిశోధన సాగించారు. 5,029 మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. ‘‘తరచూ ఆస్తమాతో బాధపడే 67% మంది, అడపదడపా ఆ బాధను అనుభవించే 49.5% మంది ధమనుల్లో ప్లేక్‌ పేరుకుంటోంది. ఆస్తమాలేని 50.5% మంది ధమనుల్లోనూ ఈ పదార్థం ఉన్నా... ఆస్తమాతో బాధపడేవారిలో దాని పరిమాణం రెండింతలు ఉంటోంది’’ అని పరిశోధనకర్త మాథ్యూ టటార్సల్‌ పేర్కొన్నారు.


అరుదైన మెదడు వ్యాధిని ఇక కచ్చితంగా గుర్తించొచ్చు!

బయోమార్కర్‌ను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: అరుదైన మెదడు వ్యాధి ‘కార్టికోబాసల్‌ డీజెనరేషన్‌ (సీబీడీ)’ను అత్యంత కచ్చితంగా గుర్తించేందుకు దోహదపడే బయోమార్కర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన సాగించింది. సీబీడీని గుర్తించేందుకు ఇప్పటివరకూ వినియోగిస్తున్న విధానాలు కేవలం 25% నుంచి 50% కచ్చితత్వం మాత్రమే కనబరుస్తున్నాయి. అయితే తాజాగా గుర్తించిన బయోమార్కర్‌ ద్వారా 89% కచ్చితత్వంతో ఈ వ్యాధిని నిర్ధారించవచ్చని పరిశోధకులు ధ్రువీకరించారు. సీబీడీ అనేది మెదడు సంకేతాలను నిలుపుదల చేస్తుంది. ఫలితంగా బాధితులు సరిగా కదల్లేరు. విషయాలను గుర్తుంచుకోవడం, మాట్లాడటం... చివరికి ఆహారం మింగడం కూడా కష్టమవుతుంది. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రన రోగి కేవలం సీబీడీతోనే బాధపడుతున్నాడని చెప్పలేం! అల్జీమర్స్‌, ప్రోగ్రసివ్‌ సూపర్‌న్యూక్లియర్‌ పాల్సీ వంటి 24 రకాల మెదడు సమస్యలతో బాధపడేవారిలోనూ ఈ లక్షణాలు కొంతవరకూ ఉంటాయి. దీంతో సీబీడీని కచ్చితంగా నిర్ధారించుకోవడం ఇప్పటివరకూ సంక్లిష్టంగానే మిగిలిపోయింది.

ఆ పదార్థం ఇదే...

పరిశోధకులు తాజాగా గుర్తించిన బయోమార్కర్‌ పేరు... ‘టౌ’ ప్రొటీన్‌! మెదడులోని నాడీ కణాల స్థిరీకరణకు దోహదపడుతుంది. ఇది అసాధారణ స్థాయుల్లో ఉండటం వల్ల పలు రకాల న్యూరోడీజెనరేటివ్‌ రుగ్మతలు తలెత్తుతాయి. అయితే, సీబీడీ బాధితుల మెదళ్లలో మైక్రోటూబ్యూల్‌ బైండింగ్‌ రీజియన్‌ (ఎంటీబీఆర్‌)-275, 282 అనే రెండు రకాల టౌ ప్రొటీన్లు అధికంగా ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు.


వాయు కాలుష్యం వల్లే.. వృద్ధుల రోగనిరోధక వ్యవస్థ బలహీనం

న్యూయార్క్‌: వృద్ధుల్లో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటానికి వయోభారమే కారణమని అనుకుంటాం. అయితే, కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. దశాబ్దాల తరబడి వాయు కాలుష్యాన్ని పీల్చడం... వారి రోగనిరోధక వ్యవస్థ క్రమంగా బలహీనపడటానికి ముఖ్య కారణమని అంటున్నారు! ‘‘వాతావరణంలోని కాలుష్య కారకాలు ఏళ్ల తరబడి శ్వాసక్రియ ద్వారా మనిషి శరీరంలోకి చేరుతున్నాయి. తర్వాత ఇవి ఊపిరితిత్తులకు సంబంధించిన లింఫ్‌ గ్రంథులు, రోగనిరోధక కణాల అంతర్భాగాల్లో తిష్ట వేసి.. రోగనిరోధక వ్యసస్థ సమర్థంగా పనిచేయకుండా అడ్డుకుంటున్నాయి’’ అని పరిశోధనకర్త డొన్నా ఫార్బెర్‌ పేర్కొన్నారు. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌-19 వంటి శ్వాసవ్యవస్థ సంబంధ వ్యాధుల విషయంలో- యువత కంటే 75 ఏళ్లు దాటిన వృద్ధుకు మరణముప్పు 80 రెట్లు ఎక్కువగా ఉండటానికి ఈ పరిస్థితే కారణమని విశ్లేషించారు.




 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని