విదేశీ విద్యార్థులపై బ్రిటన్‌ ఆంక్షలు!

బ్రిటన్‌లో రిషి సునాక్‌ ప్రభుత్వాన్ని బయట నుంచి వచ్చే వలసలు కలవరపెడుతున్నాయి.

Updated : 27 Nov 2022 06:23 IST

ఏడాదిలో 3 రెట్లయిన వలసలు
భారతీయుల సంఖ్యే అధికం

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో రిషి సునాక్‌ ప్రభుత్వాన్ని బయట నుంచి వచ్చే వలసలు కలవరపెడుతున్నాయి. దేశంలో వలసదారుల సంఖ్య నానాటికీ పెరగుతుండటంతో.. దీన్ని నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రధాని రిషి సునాక్‌ యోచిస్తున్నారు. ఇందుకోసం విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధించి, వారి సంఖ్యను తగ్గించడంతోపాటు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ‘‘వలస వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని సునాక్‌ పూర్తిగా కట్టుబడి ఉన్నారు’’ అని డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగానే విదేశీ విద్యార్థులపై ఆంక్షల యోచన చేస్తున్నారు. పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం వచ్చేవారు, డిపెండెంట్‌ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఈ ఆంక్షలు ఉండే అవకాశముంది. ఆ ఆంక్షలు ఏమిటీ?.. ప్రాధాన్యం లేని డిగ్రీలుగా వేటిని నిర్ణయిస్తారనే దానిపై అధికార ప్రతినిధి స్పష్టత ఇవ్వలేదు. ఈ వలసల విషయంలో బ్రిటన్‌ ప్రభుత్వం పలు విమర్శలు, వివాదాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో యూకే హోం మంత్రి సుయోల్లా బ్రేవర్మన్‌ భారతీయ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, ఆమె తన పదవికి రాజీనామా చేశారు. సునాక్‌ అధికారంలోకి వచ్చాక, బ్రేవర్మన్‌ను మళ్లీ హోం మంత్రిని చేయడం గమనార్హం.

* బ్రిటన్‌లో ఇటీవలి కాలంలో వలసల సంఖ్య అమాంతం పెరిగింది. 2021లో 1.73 లక్షల వలసదారులు ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య 5 లక్షలు దాటడం గమనార్హం. అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువమంది భారతీయులే ఉన్నారు. కాబట్టి, సునాక్‌ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే.. భారతీయులపైనే అధిక ప్రభావం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని