పాక్‌ కొత్త సీజేసీఎస్‌సీగా జనరల్‌ మిర్జా బాధ్యతల స్వీకరణ

పాకిస్థాన్‌లో జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌గా (సీజేసీఎస్‌సీ) జనరల్‌ సాహిర్‌ షంషద్‌ మిర్జా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

Updated : 28 Nov 2022 05:34 IST

రావల్పిండి: పాకిస్థాన్‌లో జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌గా (సీజేసీఎస్‌సీ) జనరల్‌ సాహిర్‌ షంషద్‌ మిర్జా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్‌ సర్వీసెస్‌ గార్డులు ఆయనకు వందనం సమర్పించారని పాక్‌ సైన్యం మీడియా విభాగం.. ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐఎస్‌పీఆర్‌) తెలిపింది. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల ప్రస్తుత, మాజీ సైన్యాధికారులు హాజరయ్యారు. జనరల్‌ నదీమ్‌ రజా శనివారం పదవీవిరమణ చేయడంతో జనరల్‌ మిర్జా ఈ బాధ్యతలు స్వీకరించారు. సీజేసీఎస్‌సీ అనేది పాక్‌ సైనిక దళాల్లో అత్యున్నత పదవి అయినా, దళాలను ముందుకు నడిపించడం, నియామకాలు, బదిలీల లాంటి కీలక అధికారాలు మాత్రం చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీస్టాఫ్‌ (సీఓఏఎస్‌) వద్దే ఉంటాయి.

బజ్వాపై ఆరోపణలు అవాస్తవం: పాక్‌ సైన్యం

ఇస్లామాబాద్‌: పదవీవిరమణ చేస్తున్న ఆర్మీచీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా కుటుంబసభ్యులు, బంధువులు ఆయన ఆరేళ్ల పదవీకాలంలో వందల కోట్లు సంపాదించారని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, పచ్చి అబద్ధాలని పాక్‌ సైన్యం ఖండించింది. జనరల్‌ బజ్వా మూడేళ్ల పొడిగింపు అనంతరం ఈ నెల 29న పదవీవిరమణ చేస్తున్నారు. దేశ, విదేశాల్లో ఆయన కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.1270 కోట్లు ఉంటుందని ‘ఫ్యాక్ట్‌ఫోకస్‌’  అనే వెబ్‌సైట్‌లో కథనం వచ్చింది. దాంతో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. జనరల్‌ బజ్వా, ఆయన కుటుంబ సభ్యుల పన్నుల రికార్డులను బయటపెట్టినందుకు ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని