చైనాలో లాక్‌డౌన్‌ ఆంక్షలపై ప్రజాగ్రహం

కరోనా కట్టడి నిమిత్తం చైనాలో అమలుచేస్తున్న ‘జీరో కొవిడ్‌’ విధానం ఆ దేశంలో తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. వేలమంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

Published : 28 Nov 2022 05:33 IST

అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు
కమ్యూనిస్టు దేశంలో అరుదైన దృశ్యాలు

బీజింగ్‌/షాంఘై: కరోనా కట్టడి నిమిత్తం చైనాలో అమలుచేస్తున్న ‘జీరో కొవిడ్‌’ విధానం ఆ దేశంలో తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. వేలమంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆంక్షలపై ధిక్కరణ చిహ్నంగా ఖాళీ కాగితాలు చూపుతూ, రాత్రివేళ మొబైల్‌ఫోన్ల ఫ్లాష్‌లైట్లను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన ప్రకటిస్తున్నారు. వీరికి మద్దతుగా నెటిజన్లు సైతం ఖాళీ కాగితాల చిత్రాలతో పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కనుమరుగవుతున్న తరుణంలో చైనాలో మాత్రం మళ్లీ విజృంభిస్తుండటం గమనార్హం. వరుసగా గత నాలుగు రోజులుగా చైనాలో కేసుల పెరుగుదల కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే దాదాపు 40 వేల కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ను నిరసిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రజల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. షాంఘై నగరంలో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పాలక కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లకు వ్యతిరేకంగా నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. కమ్యూనిస్టు చైనాలో ఇది అరుదైన దృశ్యం. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నాన్జింగ్‌, బీజింగ్‌ తదితర విశ్వవిద్యాలయాల్లోనూ విద్యార్థులు లాక్‌డౌన్‌ వ్యతిరేక ప్రదర్శనలకు దిగుతున్నారు. షిన్‌జియాంగ్‌ ప్రావిన్సు రాజధాని ఉరుమ్‌చిలోనూ భారీ ప్రదర్శనలు జరగడంతో దశలవారీగా ఆంక్షలు సడలిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నగరంలో లాక్‌డౌన్‌ ఆంక్షల నడుమ ఉన్న ఓ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించడంతో నిరసనలు మరింత ఉద్ధృతరూపం దాల్చాయి. వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున బలగాల్ని మోహరిస్తోంది. ఈ ఆందోళనల ఫుటేజి వీడియోలు బయటకురాకుండా ప్రభుత్వం సెన్సార్‌ చేస్తోంది. రాజధాని నగరం బీజింగ్‌లోనూ డజన్లకొద్దీ అపార్ట్‌మెంట్లు లాక్‌డౌన్‌ ఆంక్షల నడుమ ఉండటంతో ప్రజల్లో అసహనం పెరిగి ఆందోళనలకు దిగుతున్నారు.


ఎందుకిలా?

* చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న ‘జీరో-కొవిడ్‌’ విధానం కింద గత మూడు రోజులుగా ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. రానున్న శీతాకాలంలో ఈ వైరస్‌ ఇంకా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  

* చాలా దేశాలు ఈ వైరస్‌తో సహజీవనం చేయడం నేర్చుకున్నప్పటికీ, చైనాలో మాత్రం గట్టిచర్యలతో కొవిడ్‌ను కూకటివేళ్లతో పెకలించాలని చూస్తున్నారు. 6 నెలల వ్యవధి తర్వాత బీజింగ్‌లో నమోదైన మూడు కొవిడ్‌ మరణాలతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.

* దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొవిడ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే ఆర్థికవ్యవస్థ ప్రమాదంలో పడుతుందనే ఆందోళన పెరిగింది. దుకాణాలు మూతపడి వ్యాపారాలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఉత్పత్తి దెబ్బతింది. పాఠశాలలు కూడా మూతపడ్డాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని