అదే పనిగా టీవీ చూసిన కుమారుడు.. తల్లి ఏం చేసిందంటే?

పిల్లలకు క్రమశిక్షణ అలవర్చేందుకు తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తుంటారు! అదే పనిగా టీవీ చూస్తోన్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు చైనాకు చెందిన ఓ జంట మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది.

Updated : 28 Nov 2022 08:46 IST

బీజింగ్‌: పిల్లలకు క్రమశిక్షణ అలవర్చేందుకు తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తుంటారు! అదే పనిగా టీవీ చూస్తోన్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు చైనాకు చెందిన ఓ జంట మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. రాత్రంతా కూర్చొబెట్టి అతనితో బలవంతంగా టీవీ చూపించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో నివసిస్తోన్న దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల తల్లిదండ్రులు ఓ పనిమీద బయటకు వెళ్తూ.. హోంవర్క్‌ పూర్తి చేసుకుని, రాత్రి 8.30కల్లా నిద్రపోవాలని బాలుడికి సూచించారు. వారు ఆలస్యంగా తిరిగి రాగా.. అతను హోంవర్క్‌ పక్కన పెట్టేసి, అప్పటికీ టీవీ చూస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను నిద్రకు ఉపక్రమించాడు. దీంతో ఆగ్రహించిన తల్లి.. అతణ్ని దారిలో పెట్టాలని చూసింది. కుమారుడిని నిద్రలేపి బలవంతంగా టీవీ ముందు కూర్చొబెట్టింది. అతను నిద్రలోకి జారుకోకుండా ఇద్దరూ ఓ కంట కనిపెట్టారు.

మొదట్లో ఆసక్తిగానే టీవీ చూసిన బాలుడు.. క్రమంగా అలసటతో కూర్చోలేకపోయాడు. మెలకువగా ఉండటం కష్టంగా మారింది. చివరకు ఏడుపు మొదలుపెట్టాడు. నిద్రపోతానంటూ వేడుకున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతనికి ఉదయం 5 వరకు టీవీ చూపెడుతూ.. నిద్రపోనివ్వలేదని ఓ వార్తాసంస్థ తెలిపింది. తాము చేసిన పని అతనిపై సానుకూల ప్రభావం చూపిందని తల్లి చెప్పడం గమనార్హం. మరోవైపు.. ఈ వ్యవహారం కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల పెంపకంపై చర్చకు దారితీసింది. ఇది చాలా కఠినమైన శిక్ష అంటూ పలువురు స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని