కుమార్తెతో మరోసారి కనిపించిన కిమ్‌

తల్లిదండ్రులతో కలిసి గతవారం క్షిపణి ప్రయోగాన్ని వీక్షించి వార్తల్లో నిలిచిన ఉత్తర కొరియా దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కుమార్తె మరోసారీ అదే పంథాలో అందరి దృష్టిని ఆకర్షించారు.

Updated : 28 Nov 2022 05:30 IST

మున్ముందు ఉత్తర కొరియా  పాలనా పగ్గాలు ఆమెకేనా?

సియోల్‌: తల్లిదండ్రులతో కలిసి గతవారం క్షిపణి ప్రయోగాన్ని వీక్షించి వార్తల్లో నిలిచిన ఉత్తర కొరియా దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కుమార్తె మరోసారీ అదే పంథాలో అందరి దృష్టిని ఆకర్షించారు. తన తండ్రికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆమె ఈ సారి ఏకంగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో కలిసి క్షిపణి శాస్త్రవేత్తలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు బయటి ప్రపంచానికి విడుదలవడంతో కిమ్‌ తరవాత పాలనాపగ్గాలు చేపట్టేది ఆమె అన్న చర్చలు ఊపందుకున్నాయి. తొమ్మిది నుంచి పదేళ్ల మధ్య వయసుండే కిమ్‌ రెండో కుమార్తె చువేయ్‌ తన తల్లిదండ్రులతో కలిసి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఫొటోలు వారం క్రితం మీడియాలో విడుదలయ్యాయి. తాజాగా ఆదివారం.. వాసుంగ్‌-17 క్షిపణిని రూపొందించడంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి కిమ్‌, చువేయ్‌ ఉన్న ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఇవి కిమ్‌ పరిపాలన వారసత్వ అంశానికి  తెరలేపాయి. ఆయనకు 2010, 2013, 2017లో ముగ్గురు సంతానం కలిగారని, వారిలో మొదటి సంతానం కుమారుడు, రెండో సంతానం కుమార్తె అని ఉత్తర కొరియా మీడియా గతంలో పేర్కొంది. రెండో కుమార్తె గురించి మాత్రం ఎక్కడా చర్చ జరగలేదు. ఇటీవల విడుదలైన ఫొటోలతో చువేయ్‌.. ఆయన రెండో కుమార్తె అని స్పష్టమవుతోంది. తన కుటుంబసభ్యులను బాహ్యప్రపంచానికి చూపడానికి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇష్టపడడు. ప్రస్తుతం తన రెండో కుమార్తెతో బయటకు కనిపిస్తుండటంతో ఇక ఆమెనే కిమ్‌ వారసురాలు అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని