జిన్‌పింగ్‌ దిగిపోవాలి

చైనాలో జీరో కొవిడ్‌ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి.

Published : 29 Nov 2022 04:51 IST

కరోనా ఆంక్షలపై కొనసాగుతున్న నిరసనల్లో చైనీయుల డిమాండ్‌
మరిన్ని నగరాల్లో ఆందోళనలు

బీజింగ్‌: చైనాలో జీరో కొవిడ్‌ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. బీజింగ్‌ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. దేశమంతటా దాదాపు 40,000 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు. ఇప్పటికే నెలల తరబడి లాక్‌డౌన్‌లలో మగ్గిపోతున్న ప్రజలు దీనిపై మండిపడుతున్నారు. రాజధాని బీజింగ్‌ తోపాటు షాంఘై తదితర నగరాల్లో, జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన ప్రదర్శనలు ఎక్కువవుతున్నాయి. జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేయాలని స్వదేశంలో, విదేశాల్లో ప్రదర్శకులు డిమాండ్‌ చేయడమే కాదు, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లూ వినవస్తున్నాయి.  బీజింగ్‌లోని గ్జింగ్వా విశ్వవిద్యాలయంలో, నాన్జింగ్‌లోని కమ్యూనికేషన్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఉరుంకి మృతులకు నివాళులు అర్పిస్తున్న ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రచారమయ్యాయి. జనవరి వసంత కాలపు సెలవుల కోసం విద్యార్థులు కావాలనుకుంటే ఇప్పుడే ఇళ్లకు వెళ్లిపోవచ్చని గ్జింగ్వా విశ్వవిద్యాలయం నోటీసు ఇచ్చింది. టిబెట్‌ రాజధాని లాసాతోపాటు గ్వాంగ్‌డాంగ్‌, ఝెంగ్‌ ఝౌ తదితర నగరాల్లో ప్రజలు లాక్‌డౌన్‌ను వెంటనే ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆదివారం షాంఘైలో నిరసన ప్రదర్శనల గురించి వార్తలు పంపుతున్న తమ విలేఖరి ఎడ్‌ లారెన్స్‌ను పోలీసులు అరెస్టు చేసి, చేతులకు బేడీలు వేసి, తీవ్రంగా కొట్టి, కొన్ని గంటలసేపు నిర్బంధంలో ఉంచిన తరవాత విడుదల చేశారని బీబీసీ తెలిపింది. చైనాలో లాక్‌డౌన్‌ ల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల సంఖ్య గతవారం 34 కోట్లు కాగా, కొవిడ్‌ కేసుల పెరుగుదలతో ఆంక్షలను కఠినతరం చేయడం వల్ల వారి సంఖ్య తాజాగా 41.2 కోట్లకు పెరిగిందని జపాన్‌ ఆర్థిక సేవల సంస్థ నొమురా అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని