ఇంగ్లండ్‌లో ముస్లింలు, హిందువుల పెరుగుదల

బ్రిటన్‌లోని ఇంగ్లండ్‌, వేల్స్‌లలో క్రిస్టియన్ల సంఖ్య మొదటిసారిగా జనాభాలో 50 శాతం కంటే తగ్గింది.

Published : 30 Nov 2022 04:21 IST

క్రైస్తవులు 50% లోపే..
ఏ మతం లేదన్న 37.2% జనం

లండన్‌: బ్రిటన్‌లోని ఇంగ్లండ్‌, వేల్స్‌లలో క్రిస్టియన్ల సంఖ్య మొదటిసారిగా జనాభాలో 50 శాతం కంటే తగ్గింది. మరోవైపు ముస్లింలు, హిందువుల సంఖ్యలో పెరుగుదల నమోదైనట్లు మంగళవారం విడుదల చేసిన జనాభా లెక్కల వివరాలు వెల్లడించాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్‌ఎస్‌) విడుదల చేసిన 2021 జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం.. 46 శాతం మాత్రమే క్రిస్టియన్లు ఉన్నట్లు తేలింది. 2011లో వీరు 59.3 శాతం ఉన్నారు. ఈ సర్వేలో 37.2 శాతం ప్రజలు ‘మాకు మతం లేదు’ అని చెప్పారు. 2011లో 25.2 శాతం ప్రజల నుంచి ఈ సమాధానం వినవచ్చింది. ‘ఇంగ్లాండ్‌, వేల్స్‌ జన గణనలో మొదటిసారి 50 శాతం కంటే తగ్గి 46.2% (2.75 కోట్లు) జనం తాము క్రిస్టియన్లమని చెప్పారు. పదేళ్లలో వీరు 13.1 శాతం తగ్గారు’ అని జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది.

2011లో ముస్లింలు 4.9 శాతం ఉండగా, ప్రస్తుతం 6.5 శాతం (39 లక్షలు) ఉన్నట్లు తేలింది. 2011లో హిందువులు 1.5 శాతం ఉండగా, ప్రస్తుతం 1.7 శాతం (10 లక్షలు) ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి. సిక్కుల సంఖ్యలోనూ స్వల్ప పెరుగుదల నమోదైంది. 2011లో వీరు 0.8 శాతం ఉండగా, ప్రస్తుతం 0.9 శాతం (5,24,000) ఉన్నారు. బుద్ధిస్టులు సైతం 2011లో 0.4 శాతం ఉండగా, ఇపుడు 0.5 శాతం (2,73,000) ఉన్నట్లు తేలింది. యూదుల సంఖ్యలో మార్పు లేదు. వీరు జనాభాలో 0.5 శాతంగా కొనసాగుతున్నారు.

ఈ సర్వేలో మతంపై అడిగిన ప్రశ్నకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించే అవకాశం కల్పించారు. 2011లో ఈ ప్రశ్నకు 92.9% జవాబు చెప్పగా, ప్రస్తుతం 94% స్పందించారు. ఎప్పటిలా లండన్‌ భిన్న మతాల నిలయంగా నిలువగా.. హారో, లీసెస్టర్‌ నగరాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తూర్పు లండన్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా ఉంటున్న విదేశీయుల్లో పొలండ్‌, రుమేనియాల తర్వాత భారతీయులు మూడోస్థానంలో ఉన్నారు. దక్షిణాసియా భాషల్లో 2011 గణాంకాల్లో కామన్‌ లాంగ్వేజి విభాగంలో రెండోస్థానంలో ఉన్న పంజాబీ ఇపుడు మూడో స్థానానికి దిగజారింది. ఉర్దూ నాలుగో స్థానంలో ఉంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు