చైనాలో విశ్వవిద్యాలయాలు ఖాళీ

‘జీరో కొవిడ్‌’ ఆంక్షల అమలుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో చైనాలోని విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఇళ్లకు పంపివేస్తున్నాయి.

Updated : 30 Nov 2022 06:10 IST

బస్సుల్లో విద్యార్థుల తరలింపు
లాక్‌డౌన్‌ ఆందోళనల కట్టడికి చర్యలు

బీజింగ్‌, హాంకాంగ్‌: ‘జీరో కొవిడ్‌’ ఆంక్షల అమలుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో చైనాలోని విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఇళ్లకు పంపివేస్తున్నాయి. ఆందోళనల కట్టడి దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్సిటీలు ఈ చర్యలకు ఉపక్రమించాయి. కొన్ని వర్సిటీలు బస్సులు ఏర్పాటుచేసి మరీ విద్యార్థులను రైల్వేస్టేషన్లకు తరలిస్తున్నాయి. మిగతా తరగతులు, పరీక్షలను ఆన్‌లైనులో నిర్వహిస్తామని ఇవి ప్రకటించాయి. గతంలో కొన్ని ఉద్యమాల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లు క్రియాశీలక పాత్ర పోషించిన సందర్భాలు చైనాలో ఉన్నాయి. 1989 నాటి బీజింగ్‌ ‘తియానన్మెన్‌ స్క్వేర్‌’ ఉదంతంలో చైనా ఆర్మీ విద్యార్థులను దారుణంగా అణచివేసిన విషయం తెలిసిందే. వారాంతంలో 8 నగరాల్లో చోటుచేసుకున్న తీవ్ర ఆందోళనలు.. బ్రిటన్‌, అమెరికా వంటి పలు దేశాల నుంచి వాటికి లభించిన మద్దతు నేపథ్యంలో కొవిడ్‌ ఆంక్షలను స్వల్పంగా సడలిస్తామని చైనా తాజా ప్రకటన చేసింది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రాజీనామా కోరుతూ ఈ ఆందోళనలు రాజకీయ మలుపు తిరగడం కూడా ఈ వైఖరికి మరో కారణం. ప్రభుత్వం ‘జీరో కొవిడ్‌’ విధానం నుంచి వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని చైనా పాలకపక్ష పత్రిక ‘పీపుల్స్‌ డైలీ’ స్పష్టం చేసింది.

ప్రజల హక్కును గౌరవించండి : ఐరాస

శాంతియుత ఆందోళనలు చేసేందుకు ప్రజలకున్న హక్కును గౌరవించాలని ఐక్యరాజ్య సమితి చైనాను కోరింది. చైనా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత ఆందోళనలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బి తెలిపారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ చైనా పరిణామాలపై స్పందిస్తూ.. ‘చైనా అణచివేత మార్గం ఎంచుకొంది. బీబీసీ జర్నలిస్టుపైనా దాడి చేశారు’ అన్నారు. షాంఘైలో కొవిడ్‌ ఆందోళనల కవరేజీలో ఉన్న తమ సిబ్బందిని పోలీసులు నిర్బంధించి, భౌతిక దాడికి పాల్పడ్డారని బీబీసీ ఆరోపించింది. షాంఘైలో కొవిడ్‌ ఆందోళనల కవరేజీలో ఉన్న తమ సిబ్బందిని పోలీసులు నిర్బంధించి, భౌతిక దాడికి పాల్పడ్డారని బీబీసీ ఆరోపించింది. ఇంకా పలు విదేశీ వార్తాసంస్థలు కూడా ఇదే విధమైన ఆరోపణలు చేశాయి. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ వీటిపై స్పందిస్తూ..‘చట్టబద్ధంగా నడుచుకునే దేశం మాది. చట్ట ప్రకారం ప్రజల హక్కులు రక్షిస్తాం. అలాగే ఇక్కడ స్వేచ్ఛ కూడా ఆ చట్ట పరిధిలోనే ఉంటుంది’ అన్నారు.

ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రభావం : ఐఎంఎఫ్‌

బెర్లిన్‌: చైనా సామూహిక లాక్‌డౌన్లను తక్షణం విరమించుకోవాలని, ఈ పరిస్థితి ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలీనా జార్జీవా ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని