సంక్షిప్త వార్తలు (3)

పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ అధిపతిగా గతంలో పనిచేసిన జనరల్‌ అసీం మునీర్‌ మంగళవారం పాక్‌ ఆర్మీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Updated : 30 Nov 2022 06:51 IST

పాక్‌ ఆర్మీ కొత్త చీఫ్‌ బాధ్యతల స్వీకరణ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ అధిపతిగా గతంలో పనిచేసిన జనరల్‌ అసీం మునీర్‌ మంగళవారం పాక్‌ ఆర్మీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వరుసగా రెండు విడతలు ఆరేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వహించిన జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా పదవీ విరమణ చేయడంతో పాక్‌ ఆర్మీకి 17వ కొత్త చీఫ్‌గా మునీర్‌ను ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ నియమించారు.


ముగ్గురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపిన చైనా

బీజింగ్‌: నిర్మాణంలో ఉన్న తమ అంతరిక్ష కేంద్రం వద్దకు చైనా తాజాగా ముగ్గురు వ్యోమగాములను పంపించింది. వాయవ్య చైనాలోని జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌మార్చ్‌-2ఎఫ్‌ వై15 వాహక రాకెట్‌ ద్వారా షెంఝౌ-15 వ్యోమనౌకలో వారు మంగళవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే షెంఝౌ-14లో వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం వద్ద ఉన్నారు. తాజాగా వెళ్లిన ముగ్గురితో కలిపితే.. అక్కడ ఆరుగురు వ్యోమగాములు ఒకేసారి ఉండటం ఇదే తొలిసారవుతుంది. షెంఝౌ-15లో వెళ్లినవారు ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రం వద్ద విధులు నిర్వర్తించనున్నారు.


ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం: నాటో

బుకారెస్ట్‌: రష్యా దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి(నాటో) పునరుద్ఘాటించింది. ప్రపంచంలో అతి పెద్ద సైనిక కూటమి అయిన నాటోలో ఉక్రెయిన్‌ ఏదో ఒకరోజు భాగస్వామి అవుతుందని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోల్టెన్‌ బర్గ్‌ మంగళవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీయాలన్న రష్యా ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా, నాటో విదేశాంగ మంత్రులు రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో రెండు రోజుల పాటు సమావేశమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని