భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కట్టుబడ్డాం

ఇండోపసిఫిక్‌ ప్రాంతంతో బంధాలు బలోపేతం చేసుకోవడానికి అగ్రప్రాధాన్యమిస్తామని, దీనిలో భాగంగా భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడానికి కట్టుబడి ఉన్నామని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ విస్పష్టం చేశారు.

Published : 30 Nov 2022 05:13 IST

చైనాతో సంబంధాల స్వర్ణయుగం ముగిసింది
విదేశాంగ విధానంపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పష్టీకరణ

లండన్‌: ఇండోపసిఫిక్‌ ప్రాంతంతో బంధాలు బలోపేతం చేసుకోవడానికి అగ్రప్రాధాన్యమిస్తామని, దీనిలో భాగంగా భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడానికి కట్టుబడి ఉన్నామని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ విస్పష్టం చేశారు.` యూకే-చైనా సంబంధాల విషయంలో స్వర్ణయుగం ముగిసిపోయిందన్నారు. బ్రిటన్‌ విలువలు, ప్రయోజనాల విషయంలో చైనా విసురుతున్న సవాళ్ల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి విదేశాంగ విధానంపై మాట్లాడారు. వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు, విదేశీ విధాన వ్యూహకర్తలతో లండన్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ తాను అనుసరించబోయే విధానాలను వెల్లడించారు.

రాజకీయాల్లోకి రాకముందు తాను ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టానని, అన్నింటిలోకీ ఇండో-పసిఫిక్‌ ప్రాంతం చాలా ఆసక్తికరంగా ఉందని రిషి సునాక్‌ అన్నారు. ‘2050 నాటికి ప్రపంచ వృద్ధిలో సగానికి పైగా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలోనే ఉంటుంది. ఐరోపా, ఉత్తర అమెరికా కలిపినా నాలుగోవంతు వృద్ధే ఉంటుంది. అందుకే భారత్‌తో కొత్త ఎఫ్‌టీఏ కుదుర్చుకుంటున్నాం, ఇండోనేసియాతోనూ చర్చిస్తున్నాం. చాలామందిలాగే మా తాతలూ తూర్పు ఆఫ్రికా, భారత ఉపఖండం మీదుగానే యూకేకు వచ్చారు. ఇటీవలి కాలంలో హాంకాంగ్‌, అఫ్గానిస్థాన్‌, ఉక్రెయిన్‌ల నుంచి వేలమందిని స్వాగతించాం. ప్రజాస్వామ్య పరిరక్షణ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తాం’’ అని సునాక్‌ స్పష్టం చేశారు.

చైనాపై తన వైఖరిని సునాక్‌ కుండ బద్దలుకొట్టినట్లే చెప్పారు. వాళ్లతో సంబంధాల స్వర్ణయుగం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. బ్రిటన్‌ విలువలు, ప్రయోజనాలకు చైనా సవాలు విసురుతోందని, ఆ దేశం నియంతృత్వం దిశగా వెళ్లే కొద్దీ మరింత పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల విషయంలో చైనా ప్రభుత్వ విధానాన్ని బ్రిటిష్‌ ప్రధాని విమర్శించారు. షింజియాంగ్‌లో అణచివేత, హాంకాంగ్‌లో స్వేచ్ఛను హరించడంపై స్పందించాలని మీడియా, పార్లమెంటు సభ్యులకు సూచించారు. అలాగని అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనా ప్రాధాన్యాన్ని విస్మరించలేమని ఒప్పుకొన్నారు. పెరుగుతున్న పోటీని దౌత్యవిధానంతో ఎదుర్కొంటామన్నారు. రష్యాతో వివాదంలో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, తద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న యూరప్‌ సమష్టి నిర్ణయంతోనే ఉంటామని చెప్పారు. స్వదేశంలో ఆర్థికంగా బలమైన పునాది వేసుకుని, విదేశాల్లో బలం పెంచుకుంటామని రిషి చెప్పారు. తన నాయకత్వంలో యథాతథ స్థితిని పాటించేది లేదని, అన్ని విషయాల్లో విభిన్నంగా ఉంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని