సంక్షిప్త వార్తలు (7)

ప్రాణాంతక మలేరియాపై పోరులో మానవాళికి వజ్రాయుధాలుగా ఉపయోగపడే అవకాశమున్న రెండు ఎం-ఆర్‌ఎన్‌ఏ టీకాలను అమెరికాలోని జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు.

Updated : 02 Dec 2022 06:33 IST

ఎం-ఆర్‌ఎన్‌ఏ మలేరియా టీకాల వృద్ధి

వాషింగ్టన్‌: ప్రాణాంతక మలేరియాపై పోరులో మానవాళికి వజ్రాయుధాలుగా ఉపయోగపడే అవకాశమున్న రెండు ఎం-ఆర్‌ఎన్‌ఏ టీకాలను అమెరికాలోని జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. అవి వ్యాధి సోకకుండా అడ్డుకోగలవని, వ్యాప్తిని నివారించగలవని వారు వెల్లడించారు. మలేరియా పరాన్నజీవి జీవితచక్రాన్ని ధ్వంసం చేయడం ద్వారా అవి పనిచేస్తాయని తెలిపారు. మానవ శరీరంలో పరాన్నజీవి కదలికలకు దోహదపడే ప్రొటీన్‌ను ఓ టీకా లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు. వాటి ప్రత్యుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయడం ద్వారా మరో టీకా తన పనిని పూర్తిచేస్తుందని వివరించారు.


ఊబకాయ మహిళల్లో అధికంగా లాంగ్‌ కొవిడ్‌

లండన్‌: ఊబకాయంతో బాధపడుతున్న మహిళలు లాంగ్‌ కొవిడ్‌తో ఇబ్బందిపడే ముప్పు అధికంగా ఉంటుందని బ్రిటన్‌లోని ఈస్ట్‌ ఆంగ్లియా విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 1,487 మంది నుంచి ఆన్‌లైన్‌ వేదికగా వివరాలు సేకరించి వారు విశ్లేషించారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో దీర్ఘకాలిక కొవిడ్‌ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలున్నాయనీ నిర్ధారించారు. కరోనా బారినపడ్డ వారిలో దగ్గు, తలనొప్పి, అలసట, శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతినొప్పి వంటివి 12 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగడాన్ని లాంగ్‌ కొవిడ్‌గా నిర్వచిస్తున్నారు.


వెన్నుపాముకు ఇక మెరుగైన చికిత్స

లండన్‌: అత్యంత ప్రమాదకరమైన వెన్నుపాము (స్పైనల్‌ కార్డ్‌) గాయాలకు సమీప భవిష్యత్తులో మెరుగైన చికిత్సా మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అవసరమైన సరికొత్త మిశ్రమ జీవ పదార్థాన్ని ఐర్లాండ్‌లోని లిమెరిక్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అందులో గెలాటిన్‌, ఇమ్యునోమాడ్యులేటరీ హయలురోనిక్‌ ఆమ్లంతో పాటు పీఈడీవోటీ:పీఎస్‌ఎస్‌ అనే పాలీమర్లు భాగంగా ఉంటాయి. గాయం అనంతరం వెన్నుపాము వేగంగా కోలుకోవడంలో, కొత్త కణజాలం తయారవడంలో మిశ్రమ జీవ పదార్థం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.


ఆ రెండు ఔషధాలతో నల్లుల అంతం

వాషింగ్టన్‌: పిల్లులు, శునకాల వంటి పెంపుడు జంతువుల్లో పరాన్నజీవుల ఆట కట్టించేందుకు వైద్యులు ఉపయోగించే ఫ్లూరలేనర్‌, ఐవర్‌మెక్టిన్‌ అనే రెండు ఔషధాలు నల్లుల బెడదను అంతం చేయడంలోనూ దోహదపడగలవని అమెరికాలోని నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనంలో గుర్తించారు. నల్లుల నాడీ వ్యవస్థలోని కీలక రిసెప్టార్లను అవి లక్ష్యంగా చేసుకుంటాయని వివరించారు. తద్వారా వాటి మరణానికి కారణమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫ్లూరలేనర్‌ ఈ విషయంలో అత్యంత సమర్థంగా పనిచేస్తున్నట్లు తేల్చారు. కోళ్ల పరిశ్రమలో నల్లుల సమస్య కొంతకాలంగా అధికమవుతోన్న సంగతి తెలిసిందే.


బంగ్లా యుద్ధంలో ఓటమిపై పాక్‌లో రగడ

కరాచీ: తూర్పు పాకిస్థాన్‌ (బంగ్లాదేశ్‌)లో 1971లో ఎదురైన ఘోర పరాజయానికి ఎవరు బాధ్యులనే రగడ ప్రస్తుతం పాకిస్థాన్‌లో మొదలైంది. నాటి ఓటమి రాజకీయ వైఫల్యమని పాక్‌ మాజీ ప్రధాన సైన్యాధికారి జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా వ్యాఖ్యానించగా, అది సైనికపరమైన ఘోర వైఫల్యమని పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ ప్రతివిమర్శ చేశారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) 55వ వ్యవస్థాపన దినోత్సవంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. ఆ యుద్ధంలో 92,000 మంది పాక్‌ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. వారిలో 34,000 మంది మాత్రమే సైనికులనీ, మిగిలినవారు వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు చెందినవారని జనరల్‌ బజ్వా కొత్త భాష్యం చెప్పారు. పాక్‌ సైనికులు చేసిన త్యాగాలు గుర్తింపునకు నోచుకోలేదని అన్నారు.  బిలావల్‌ దీంతో విభేదించారు. పాక్‌ సైన్య వైఫల్యం వల్ల యుద్ధ ఖైదీలుగా చిక్కిన సైనికులను తన తాత జుల్ఫికర్‌ అలీ భుట్టో క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు.


బొగ్గు గనిలో పేలుడు.. పాక్‌లో 9 మంది దుర్మరణం

పెషావర్‌: పాకిస్థాన్‌ ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని బొగ్గు గనిలో బుధవారం గ్యాస్‌ కారణంగా సంభవించిన పేలుళ్లలో 9 మంది కార్మికులు దుర్మరణం చెందారు. నలుగురు గాయపడ్డారు. ఆఫ్గానిస్థాన్‌ సరిహద్దులోని ఈ గనిలో 13 మంది కార్మికులు పనిచేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. అక్కడ ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ కారణంగా మంటలు చెలరేగాయి.


అంతర్గత వ్యవహారాలపై సమీక్షించనున్న కిమ్‌

సియోల్‌: అమెరికా, దక్షిణ కొరియాలతో పెరుగుతున్న ఉద్రిక్తతలపై  చర్చించడానికి ఈ నెలాఖరులోగా భారీస్థాయి రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తమ పార్టీకి పిలుపునిచ్చారు. అణు, క్షిపణి పరీక్షలను ఉత్తర కొరియా ఈ ఏడాది విస్తృతం చేసింది. ఈ పరిణామం అమెరికా, దక్షిణ కొరియాలపై ఒత్తిడిని పెంచింది. ‘కిమ్‌ అధ్యక్షతన పాంగాంగ్‌లో బుధవారం జరిగిన అధికార వర్కర్స్‌ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో.. 2022లో అమలు చేసిన విధానాల గురించి చర్చించారు. కొద్దిరోజుల్లో పార్టీ సెంట్రల్‌ కమిటీ సమావేశాన్ని జరపాలని నిర్ణయించారు’ అని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా గురువారం వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని