కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్న చైనా

చైనాలో జీరో కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనలకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం దిగివచ్చింది.

Updated : 02 Dec 2022 06:32 IST

బీజింగ్‌: చైనాలో జీరో కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనలకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం దిగివచ్చింది. కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. పలు నగరాల్లో పౌరుల సంచారానికి అనుమతించారు. అయితే, వీధుల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇళ్ల నుంచి బయటకు వస్తున్న వారికి విస్తృత సోదాలు తప్పడంలేదు. ముఖ్యంగా వారి చేతుల్లోని సెల్‌ఫోన్లను తనిఖీ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక సమాచారం, నినాదాలతో పాటు ట్విటర్‌ వంటి నిషేధిత యాప్‌లు ఉన్నాయేమోనని పోలీసులు పరిశీలించి తొలగిస్తున్నారు. రాజధాని బీజింగ్‌తో పాటు దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌ, ఉత్తర చైనాలోని షిజియాజోంగ్‌, నైరుతి చైనాలోని చెంగ్దుతో సహా పలు ప్రముఖ నగరాల్లో పౌరుల కదలికలపై ఆంక్షలను సడలిస్తున్నట్లు కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్లను తెరిచారు. బస్సు సర్వీసులను పునరుద్ధరించారు.  గురువారం కొత్తగా 36,061 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 31,911 వ్యాధి లక్షణాలను బహిర్గతం చేయనివేనని తెలిపింది. ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాధికారకత బలహీనపడిందని, నియంత్రణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, ఎక్కువ మందికి టీకాలు వేయడం కూడా పూర్తయినందునే ఆంక్షలు సడలిస్తున్నట్లు కొవిడ్‌ నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్న వైస్‌ ప్రీమియర్‌ సన్‌ చున్లాన్‌ వెల్లడించారు.


6న జియాంగ్‌ జెమిన్‌ అంత్యక్రియలు

అనారోగ్యంతో బుధవారం మృతి చెందిన చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ అంత్యక్రియలు ఈ నెల 6న నిర్వహించనున్నట్లు గురువారం ప్రభుత్వం వెల్లడించింది. జెమిన్‌ భౌతిక కాయాన్ని గురువారం షాంఘై నుంచి ప్రత్యేక విమానంలో బీజింగ్‌కు తీసుకువచ్చారు.

భారత్‌ సంతాపం

జియాంగ్‌ జెమిన్‌ మృతి పట్ల భారత దేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వీబో అకౌంట్‌ ద్వారా అధికారిక ప్రకటనను వెలువరించింది. చైనా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జియాంగ్‌ జెమిన్‌ 1996లో మన దేశంలో పర్యటించారు. దిల్లీని సందర్శించిన తొలి చైనా అధినేత ఆయనే.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని