బ్రిటన్‌ రాజభవనంలో ‘జాతి’ రగడ

జాత్యహంకార ఆరోపణలకు బ్రిటన్‌ రాజభవనం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ మరోసారి వేదికయ్యింది. నల్లజాతి సంతతికి చెందిన నగోజీ ఫులాని అనే మహిళపై ప్రిన్స్‌ విలియమ్‌ గాడ్‌మదర్‌ సుసాన్‌ హుస్సే జాతివివక్ష చూపారన్నది తాజా వివాదం.

Published : 03 Dec 2022 05:43 IST

చిన్నప్పుడు నేనూ బాధితుడినే: సునాక్‌

లండన్‌: జాత్యహంకార ఆరోపణలకు బ్రిటన్‌ రాజభవనం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ మరోసారి వేదికయ్యింది. నల్లజాతి సంతతికి చెందిన నగోజీ ఫులాని అనే మహిళపై ప్రిన్స్‌ విలియమ్‌ గాడ్‌మదర్‌ సుసాన్‌ హుస్సే జాతివివక్ష చూపారన్నది తాజా వివాదం. ఈ విషయం బయటపడటంతో సుసాన్‌ హుస్సే ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతూ క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో జాతివివక్షపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. వివాదంపై తాను వ్యాఖ్యానించడం సరికాదన్న ఆయన.. తన జీవితంలోనూ జాత్యహంకారాన్ని ఎదుర్కొన్న సందర్భాలను గుర్తు చేసుకొన్నారు. ‘చిన్నతనంలో, యుక్త వయసులో ఉన్నపుడు నాకూ అటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. అవి నేటికీ కొనసాగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదు. జాత్యహంకారాన్ని ఎదుర్కోవడంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. ఆ ప్రయత్నం ఎన్నటికీ ముగిసిపోదు. మనకు అటువంటి సందర్భం ఎప్పుడు ఎదురైనా.. దీటుగా ఎదుర్కోవాలి’ అని ఓ అంతర్జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్‌ వెల్లడించారు.

రిషి సునాక్‌కు తొలి ఎదురుదెబ్బ

బ్రిటన్‌ ప్రధానిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌ నాయకత్వానికి తొలి ఎన్నికల పరీక్షగా భావించిన కీలక ఉప ఎన్నికలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అభ్యర్థి మెరుగైన మెజార్టీతో విజయం సాధించారు. వాయవ్య ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌ నియోజకవర్గానికి జరిగిన ఈ ఎన్నిక ఫలితం శుక్రవారం వెల్లడైంది. లేబర్‌ పార్టీకి చెందిన సమంత డిక్సన్‌ 17,309 ఓట్లతో ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 61 శాతం ఓట్ల షేర్‌ సొంతం చేసుకొన్న ఈమె కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన తన ప్రత్యర్థి కంటే దాదాపు 11 వేల ఓట్లు అధికంగా సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని