సంక్షిప్త వార్తలు(3)

పియానో సాధన ద్వారా మెదడు సామర్థ్యం పెరుగుతుందని బ్రిటన్‌లోని బాత్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

Updated : 04 Dec 2022 05:58 IST

పియానోతో మదిలో సంతోష సరిగమలు

లండన్‌: పియానో సాధన ద్వారా మెదడు సామర్థ్యం పెరుగుతుందని బ్రిటన్‌లోని బాత్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీనివల్ల దృశ్యాలు, ధ్వనులను ప్రాసెస్‌ చేసే సత్తా వృద్ధి చెందుతుందని వెల్లడైంది. ఇది దుఃఖ  భావనలనూ దూరం చేయగలదని పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా.. సంగీత పరిజ్ఞానం లేని కొందరికి వారానికి గంట చొప్పున పియానో పాఠాలు బోధించారు. 11 వారాల్లోనే వీరిలో గణనీయ మార్పులు కనిపించాయి. దృశ్య-శ్రవణ అంశాలను గుర్తించడంలో వారి సామర్థ్యం మెరుగుపడింది. ఒత్తిడి, కుంగుబాటు, ఆదుర్దా కూడా తగ్గింది. వాహనం నడపడం, రోడ్డు దాటడం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక వ్యక్తిని సులువుగా గుర్తించడం, టీవీ వీక్షణ వంటి అంశాల్లో మార్పు స్పష్టంగా కనిపించింది.


ఆస్పత్రుల్లో చేరిన కొవిడ్‌ బాధితుల్లో 11% మందికి ఊపిరితిత్తుల సమస్యలు

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 వచ్చి, ఆస్పత్రులలో చేరిన వారిలో 11% వరకు రోగులకు ఊపిరితిత్తుల కణజాలానికి మచ్చ ఏర్పడిందని, అవి ఎప్పటికీ మానకపోగా భవిష్యత్తులో పరిస్థితి మరింత ఇబ్బందికరం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ రెస్పిరేటరీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ అనే పత్రికలో ఈ పరిశోధన వ్యాసం ప్రచురితమైంది. కొవిడ్‌లో వివిధ తీవ్రతలుండి, ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయినవారిలో ఫైబ్రోటిక్‌ లంగ్‌ డ్యామేజ్‌ ఉన్నవారు, భవిష్యత్తులో మళ్లీ చూపించుకోవాల్సిన కేసులను వారు పరిశీలించారు. ఊపిరితిత్తులు తంతీకరణం (ఫైబ్రోసిస్‌) చెందడం, ఊపిరితిత్తుల కణజాలంపై మచ్చ ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తితే ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో పాటు రక్తంలో ఆమ్లజని శాతం కూడా తగ్గుతుంది. ఇలా పాడైన ఊపిరితిత్తులు మళ్లీ బాగుపడకపోవడంతో పాటు, భవిష్యత్తులో మరింత ఇబ్బంది అవుతుందని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో జాతీయ గుండె, ఊపిరితిత్తుల సంస్థకు చెందిన పరిశోధకుడు ఇయాన్‌ స్టివార్ట్‌ తెలిపారు. ‘‘చాలామందికి దీర్ఘకాలం పాటు ఊపిరి అందకపోవడం ఉంటోంది. కొవిడ్‌ వచ్చి ఆస్పత్రిపాలైన వారిలో చాలామందికి ఊపిరితిత్తుల్లో తంతీకరణ సమస్యలు ఉంటున్నాయి. ఇలా ముప్పున్న రోగులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి స్కానింగుతో పాటు ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు చేయాలి’ అని ఆయన సూచించారు. వ్యాధి ముదిరిన పక్షంలో వెంటనే గమనించుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఫాలో-అప్‌ కోసం వచ్చినవారికి సీటీస్కాన్‌ తీసినప్పుడు ఊపిరితిత్తుల తీరు మారితే వెంటనే అప్రమత్తం కావాలన్నారు. మొత్తం 3,500 మంది రోగులను పరిశీలించగా వారిలో 209 మందికి ఇబ్బందులు వచ్చాయి.


భారత్‌ జి-20 ఎజెండాకు  మద్దతిస్తాం: ఐఎంఎఫ్‌

వాషింగ్టన్‌: ప్రస్తుత ప్రపంచ సంక్షోభాలను తక్షణమే ఏకాభిప్రాయంతో పరిష్కరించాలన్న భారత్‌ జి-20 ఎజెండాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పూర్తిగా బలపరుస్తోందని ఆ సంస్థ సీనియర్‌ అధికారిణి డేలా పజార్‌ తెలిపారు. భారత్‌ గురువారం జి-20 అధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే వారం భారత్‌, చైనాలను సందర్శించనున్న డేలా..ఐఎంఎఫ్‌ వ్యూహ, విధాన సమీక్షా విభాగ డైరెక్టర్‌. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న ఆహార, ఇంధన కొరతల నివారణకు భారత్‌ కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణకు భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఐఎంఎఫ్‌ పరిగణనలోకి తీసుకొంటుందని చెప్పారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని