Twitter: ట్విటర్‌ వివాదంలో భారతీయులు విజయ గద్దె, రో ఖన్నా పేర్లు!

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వార్తాకథనాన్ని ట్విటర్‌ అడ్డుకున్న ఉదంతంలో భారత సంతతికి చెందిన ఇద్దరి పేర్లు బయటికొచ్చాయి.

Updated : 04 Dec 2022 07:47 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వార్తాకథనాన్ని ట్విటర్‌ అడ్డుకున్న ఉదంతంలో భారత సంతతికి చెందిన ఇద్దరి పేర్లు బయటికొచ్చాయి. ట్విటర్‌ మాజీ ఉన్నతోద్యోగి విజయ గద్దెపై అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ విడుదల చేశారు. దీనిపై స్వతంత్ర జర్నలిస్టు మాట్‌ తైబీ విశ్లేషణ చేపట్టారు. 2020 ఎన్నికల సమయంలో బైడెన్‌ టీంతో విజయ జరిపిన సంభాషణల వివరాలను మస్క్‌ బయటపెట్టారు.  హంటర్‌ బైడెన్‌ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన విషయం ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశంపై సెన్సార్‌షిప్‌ విధించడం వెనక విజయ క్రియాశీలంగా పనిచేశారని మాట్‌ తైబీ పేర్కొన్నారు. దీనిపై డెమొక్రటిక్‌ పార్టీ ఎంపీ, భారత సంతతికి చెందిన రో ఖన్నా.. విజయకు మెయిల్‌ రాశారని తెలిపారు. హంటర్‌ బైడెన్‌ ల్యాప్‌టాప్‌ స్టోరీపై ట్విటర్‌ ఎందుకు సెన్సార్‌షిప్‌ విధించిందంటూ ఆయన ఆరా తీశారని చెప్పారు. ఈ వివరాలను బయటకు చెప్పొద్దని సైతం రో ఖన్నా.. విజయకు సూచించారని వెల్లడించారు. ఖన్నా మెయిల్‌కు నిబంధనలకు అనుగుణంగానే ఇది జరిగిందని విజయ వివరణ ఇచ్చారు.

ల్యాప్‌టాప్‌ కథేంటంటే?: తన కుమారుడు హంటర్‌ బైడెన్‌ అవినీతి ఆరోపణలపై ఉక్రెయిన్‌లో విచారణ జరగకుండా.. అప్పట్లో ఉపాధ్యక్ష పదవిలో ఉన్న జో బైడెన్‌ అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ కంపెనీ ప్రతినిధితో జో బైడెన్‌ భేటీ కూడా అయ్యారని ‘న్యూయార్క్‌ పోస్ట్‌’ ఓ కథనంలో పేర్కొంది. జో బైడెన్‌ను కలిసే అవకాశం ఇప్పించినందుకు ఆ కంపెనీ ప్రతినిధి హంటర్‌ బైడెన్‌కు ఈమెయిల్‌ రాశారని కథనంలో వివరించింది. ఆ మెయిళ్లు హంటర్‌ బైడెన్‌ ల్యాప్‌టాప్‌లో లభ్యమయ్యాయని రాసుకొచ్చింది. దీన్ని డెమోక్రాట్లు ఖండిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని