ఇరాన్‌లో నారీ విజయం

రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హిజాబ్‌ ఆందోళనల క్రమంలో.. ఇరాన్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమీని (22) అనే యువతి మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది.

Published : 05 Dec 2022 04:27 IST

ప్రజాందోళనకు దిగొచ్చిన సర్కారు.. నైతిక పోలీసు విభాగం రద్దు

టెహ్రాన్‌: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హిజాబ్‌ ఆందోళనల క్రమంలో.. ఇరాన్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమీని (22) అనే యువతి మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. ‘ఈ విభాగానికి న్యాయవ్యవస్థతో సంబంధం లేదు. దీన్ని రద్దు చేశాం’ అని దేశ అటార్నీ జనరల్‌ (ఏజీ) మొహమ్మద్‌ జాఫర్‌ మోంతజేరి ప్రకటించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. హిజాబ్‌ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై పార్లమెంటు, న్యాయవ్యవస్థలు కలిసి సమాలోచనలు జరుపుతున్నాయంటూ ఏజీ వెల్లడించిన మరుసటిరోజే ఈ ప్రకటన వెలువడింది. పోలీసుల వైఖరికి నిరసనగా ప్లకార్డులు, బేనర్లు చేతబట్టి.. నడిరోడ్లపై హిజాబ్‌లు తగులబెడుతూ, జడలు కత్తిరించుకొన్న ఇరాన్‌ మహిళల పోరాటం ఫలించింది.  ఈ ఏడాది సెప్టెంబరులో అమీని అనే యువతి హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వారి కస్టడీలో ఉండగానే.. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. దీంతో అమీని మృతిపై సెప్టెంబర్‌ 17న ప్రజా నిరసనలు మొదలయ్యాయి. క్రమంగా అవి ఉద్ధృతంగా మారి.. రాజధాని టెహ్రాన్‌తో సహా దేశవ్యాప్తంగా పలు నగరాలకు వ్యాపించాయి.

ఏమిటీ నైతిక పోలీసు విభాగం?: ఇరాన్‌లో ఏడేళ్లు దాటిన బాలికలు, మహిళలు షరియా చట్టం ప్రకారం తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాలి. తల మీది జుట్టును పూర్తిగా కప్పి ఉంచేలా హిజాబ్‌ ధరించాలి. నియమాలను ఉల్లంఘించే మహిళలను అరెస్టు కూడా చేస్తారు. ఈ చట్టం అమలును పర్యవేక్షించేందుకు 2005లో ప్రత్యేక నైతిక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ‘గస్త్‌- ఏ -ఎర్షాద్‌’గా దీన్ని పిలుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని