సంక్షిప్త వార్తలు(5)

భిన్న జాతుల మధ్య కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇప్పటికీ ఎక్కువగానే ఉందని అమెరికాలోని రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఆర్‌ఐటీ) శాస్త్రవేత్తల తాజా పరిశోధన తేల్చింది.

Updated : 06 Dec 2022 06:16 IST

భిన్న జాతుల మధ్య కొవిడ్‌ వ్యాప్తికి ఆస్కారం

వాషింగ్టన్‌: భిన్న జాతుల మధ్య కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇప్పటికీ ఎక్కువగానే ఉందని అమెరికాలోని రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఆర్‌ఐటీ) శాస్త్రవేత్తల తాజా పరిశోధన తేల్చింది. కంప్యూటర్‌ సిమ్యులేషన్ల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. కణాల్లోకి ప్రవేశించడానికి కరోనా తన స్పైక్‌ ప్రొటీన్‌ను ఉపయోగించుకుంటుంది. పలు వేరియంట్లలోని ఈ ప్రొటీన్లు.. మానవులు, గబ్బిలాల కణాల్లోని ఏసీఈ2 గ్రాహకాలకు అంటుకుంటున్న తీరును పరిశోధకులు పరిశీలించారు. ‘‘ఈ వైరస్‌.. మానవుల్లో ఎక్కువగా, గబ్బిలాల్లో తక్కువగా అలవాటు పడటం వల్ల పరిణామక్రమపరమైన సర్దుబాటు జరిగి ఉంటుందని ఆశించాం. అయితే పెద్దగా మార్పేమీ లేకపోవడాన్ని గమనించాం. కణంలోకి ప్రవేశించడానికి వైరస్‌ ఉపయోగించుకునే ఏసీఈ2 ప్రదేశం మార్పులకు లోనుకాకపోవడమే ఇందుకు కారణం’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న గ్రెగోరీ బాబిట్‌ తెలిపారు. అందువల్ల ఆ వైరస్‌.. మానవుల నుంచి గబ్బిలాలకు తిరిగి వ్యాపించకుండా పెద్దగా అడ్డంకులేమీ లేవన్నారు. దీన్ని బట్టి.. వివిధ జాతుల మధ్య ఈ వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుందని స్పష్టమవుతోందని తెలిపారు.  కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ తొలుత గబ్బిలాల నుంచి మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ తర్వాత డెల్టా, ఒమిక్రాన్‌ వంటి భిన్న రకాలుగా రూపాంతరం చెందిందని విశ్లేషిస్తున్నారు.


పిల్లల్లో మారుతున్న లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు

లండన్‌: చిన్నారులు, కౌమారప్రాయుల్లో లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉందని ఓ అధ్యయనం తేల్చింది. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌లో ప్రచురితమయ్యాయి. 11-17 ఏళ్ల మధ్య వయసున్న 5,086 మంది చిన్నారులపై ఈ పరిశోధన సాగింది. వీరు 2020 సెప్టెంబరు నుంచి గత ఏడాది మార్చి మధ్య కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. అందులో 2,909 మంది కరోనా పాజిటివ్‌గా, 2,177 మంది నెగెటివ్‌గా తేలారు. కొవిడ్‌ సోకినవారి ఆరోగ్య పరిస్థితిని ఆరు నెలలు, సంవత్సరం తర్వాత ఆరా తీశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట సహా 21 రకాల లక్షణాల గురించి వారిని ప్రశ్నించారు. ఏడాది కాలంలో ఈ లక్షణాలు మార్పునకు లోనయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కొందరిలో మొదట కనిపించిన రుగ్మతలు తగ్గిపోయి, కొత్తవి వచ్చాయని పేర్కొన్నారు. 10.9 శాతం మందిలో ఏడాది వరకూ కూడా అలసట లక్షణం కనిపించిందని తెలిపారు.


గర్జించిన ఉత్తర కొరియా శతఘ్నులు  

సియోల్‌: ఉభయ కొరియాల మధ్య అగ్గి చల్లారడంలేదు. ఈ ప్రాంతంలో ఆయుధ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర కొరియా 130 శతఘ్నిగుళ్లను పేల్చింది. అవి తమ సముద్ర సరిహద్దులకు చేరువలో పడ్డాయని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు దేశాలకు మధ్య ఏర్పాటు చేసిన బఫర్‌ జోన్‌ను ఉత్తర కొరియా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒప్పందాలకు కట్టుబడాలని పొరుగు దేశానికి హెచ్చరిక చేసింది.  


జియాంగ్‌ జెమిన్‌ అంత్యక్రియలు పూర్తి

బీజింగ్‌: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ అంత్యక్రియలు బీజింగ్‌లో సోమవారం ముగిశాయి. ల్యుకేమియాతో బాధపడుతున్న 96 ఏళ్ల జెమిన్‌ నవంబరు 30న షాంఘైలోని సైనిక ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ సహా పలువురు పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులు జెమిన్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు.


నేపాలీ కాంగ్రెస్‌కే అందలం

కాఠ్‌మాండూ: నేపాల్‌ పార్లమెంటు ఎన్నికల్లో అధికార నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ) నేతృత్వంలోని అయిదు పార్టీల కూటమి సత్తా చాటింది. సోమవారం వెలువడిన తుది ఫలితాల్లో ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా నేతృత్వంలోని ఎన్‌సీ 57 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 165 స్థానాలకుగానూ, ఎన్‌సీ కూటమికి 90 సీట్లు దక్కాయి. 275 స్థానాలు గల ప్రతినిధుల సభకు 165 మంది సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్‌ ద్వారా, మరో 110 మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ/ కూటమికి రెండు కేటగిరీల్లో కలిపి 138 స్థానాలు అవసరం కాగా, ఎన్‌సీ కూటమికి 136 సీట్లు వచ్చాయి. ఇద్దరు స్వతంత్రుల మద్దతు సాధించడం కూటమికి సులువే.

కూటమి నేతల భేటీ: ఎన్‌సీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చిన నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు సోమవారం ప్రధాని దేవ్‌బా అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, భవిష్యత్‌ కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని