చైనాలో కొవిడ్‌ ఆంక్షల సడలింపు

కొవిడ్‌-19 కేసులను పూర్తిగా నిరోధించాలన్న పట్టుదలతో అనుసరిస్తున్న జీరో కొవిడ్‌ విధానాన్ని చైనా ప్రభుత్వం కొంతమేర సడలించింది.

Published : 06 Dec 2022 05:26 IST

బీజింగ్‌: కొవిడ్‌-19 కేసులను పూర్తిగా నిరోధించాలన్న పట్టుదలతో అనుసరిస్తున్న జీరో కొవిడ్‌ విధానాన్ని చైనా ప్రభుత్వం కొంతమేర సడలించింది. కొత్తగా వ్యాపిస్తున్న కరోనా వేరియంట్లు బలహీనమైనవి కనుక ఆంక్షలను సడలిస్తున్నట్లు తెలిపింది. జీరో కొవిడ్‌ పేరుతో విధిస్తున్న సుదీర్ఘ లాక్‌డౌన్‌లను చైనీయులు తీవ్రంగా నిరసిస్తున్నారు. నవంబరు 25న లాక్‌డౌన్‌ వల్ల గేట్లు మూసివేసిన ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది మరణించడంతో రాజధాని బీజింగ్‌, షాంఘై సహా పలు నగరాల్లో నిరసనలు పెల్లుబికాయి. దేశాధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ రాజీనామా కోసం డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో సోమవారం బీజింగ్‌ సహా 16 నగరాల్లో ప్రయాణికులను బస్సులు, భూగర్బ రైళ్లలోకి స్వేచ్ఛగా అనుమతించారు. గడచిన 48 గంటల్లో కరోనా పరీక్ష నెగెటివ్‌ అని వచ్చినవారిని మాత్రమే అనుమతించాలన్న నిబంధనను అధికారులు సడలించారు. పారిశ్రామిక నగరాల్లో కరోనా కేసులు నమోదైన వాడలు మినహా మిగిలిన చోట్ల మార్కెట్లను తెరిచారు. ప్రజల కదలికలపై ఆంక్షలను చాలావరకు ఎత్తివేశారు. మరోవైపు, జీరో కొవిడ్‌ విధానానికి ప్రభుత్వం 2023 ద్వితీయార్ధం లేదా 2024 ప్రథమార్ధంలో మాత్రమే స్వస్తి చెబుతుందని సమాచారం.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని