సంక్షిప్త వార్తలు(5)

జియాంగ్‌ జెమిన్‌ పర్యవేక్షణలో చైనా ప్రధాన ఆర్థికశక్తిగా ఎదిగిందనీ, ఆయన నాయకత్వంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అనేక సవాళ్లను అధిగమించిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రశంసించారు.

Updated : 07 Dec 2022 06:08 IST

చైనా మాజీ అధ్యక్షుడు జెమిన్‌కు ఘన నివాళి

బీజింగ్‌: జియాంగ్‌ జెమిన్‌ పర్యవేక్షణలో చైనా ప్రధాన ఆర్థికశక్తిగా ఎదిగిందనీ, ఆయన నాయకత్వంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అనేక సవాళ్లను అధిగమించిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రశంసించారు. మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ నవంబరు 30న లుకేమియాతో మరణించగా, ఆయన సంస్మరణార్థం మంగళవారం గ్రేట్‌ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌, జెమిన్‌ భార్య, ఇతర నాయకులు నివాళులర్పించారు 1989 - 2002 మధ్య చైనా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జెమిన్‌ పనిచేశారు. ఆ సమయంలో ఎదురైన రాజకీయ సంక్షోభాలను జెమిన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. జెమిన్‌ స్మారక కార్యక్రమాన్ని ప్రభుత్వ టెలివిజన్‌ ప్రసారం చేసింది.


ప్రపంచమంతా కార్యస్థానాల్లో వేధింపులు
సర్వే వెల్లడి

ఐక్యరాజ్య సమితి: పనిచేసే చోట రకరకాల వేధింపులకు గురవడమనేది ప్రపంచమంతటా ఉందని అంతర్జాతీయ కార్మికసంస్థ, లాయిడ్స్‌ రిజిస్టర్‌ ఫౌండేషన్‌, గ్యాలప్‌ సంస్థల సంయుక్త సర్వే నిర్ధారించింది. కార్యస్థానాల్లో హింస, వేధింపుల విస్తృతిపై జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ అధ్యయనమిది. దీని ప్రకారం యువత, వలస వచ్చినవారు, వేతన కూలీలు, ముఖ్యంగా మహిళలు పనిచేసే చోట వేధింపులను ఎదుర్కొంటున్నారు. వేధింపులు మూడు రకాలుగా ఉండవచ్చు. అవి శారీరక, మానసిక, లైంగిక వేధింపులు. గత ఏడాది మొత్తం 121 దేశాల్లో సర్వే చేసిన 75,000 మంది కార్మికుల్లో 22 శాతం ఈ మూడింటిలో ఏదో ఒక తరహా వేధింపులకు గురయ్యామని చెప్పారు. 17.9 శాతం స్త్రీ పురుషులు మానసిక వేధింపులకు గురయ్యామన్నారు. 8.5 శాతం శారీరక హింస, వేధింపులకు గురయ్యారు. 6.3 శాతం మంది లైంగిక వేధింపులకు గురయ్యారు.


ద.కొరియా సినిమా చూశారని.. కాల్చిచంపారు
ఉత్తర కొరియాలో విద్యార్థులపై దారుణం

సియోల్‌: అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ చెప్పిందే ఉత్తర కొరియాలో వేదం.. చేసిందే చట్టం. ఇతర దేశాల సంస్కృతి ప్రభావం తమ దేశ పౌరులపై ఉండకూడదని టీవీ, రేడియో, శీతల పానీయాలు, దుస్తులు, తలకట్టు వంటి వాటిపై ఆ దేశంలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి కఠినశిక్షలు విధిస్తారు. రెండు నెలల క్రితం దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూశారని.. ఇద్దరు విద్యార్థులకు మరణశిక్ష విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్‌ ప్రావిన్స్‌ ప్రాంతం చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు హైస్కూలు విద్యార్థులు అక్టోబరు నెలలో దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్‌ డ్రామాలు చూశారని ఉత్తర కొరియా అధికారులు వారిపై నేరారోపణ చేసినట్లు కొరియన్‌ మీడియా కథనాలు వెల్లడించాయని ‘ది ఇండిపెండెంట్‌’ వార్తాసంస్థ పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించినందుకు వారికి మరణశిక్ష విధించి, బహిరంగంగా కాల్చి చంపినట్లు వెల్లడించింది.


పరస్పరం కవ్వించుకొంటున్న కొరియాలు

సియోల్‌: తన సరిహద్దుకు సమీపంలో దక్షిణ కొరియా, అమెరికా సేనలు ఫిరంగులు, రాకెట్లతో కాల్పుల అభ్యాసాలు నిర్వహిస్తున్నందుకు ప్రతిగా ఉత్తర కొరియా సోమ, మంగళవారాల్లో దక్షిణ కొరియా సముద్ర జలాల సమీపంలోకి ఫిరంగి గుళ్లను పేల్చింది. రెండు కొరియాల మధ్య ఉద్రిక్తతల ఉపశమనానికి 2018లో కుదిరిన సామరస్య ఒప్పందాన్ని తాజా కాల్పులతో ఉత్తర కొరియా ఉల్లంఘించిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు కొరియాల విభజన రేఖ నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు తటస్థ మండలంగా ప్రకటించారు. ఈ తటస్థ మండలానికి వెలుపలే అమెరికా సేనలతో కలసి సంయుక్త అభ్యాసాలు తాము నిర్వహిస్తున్నామనీ, అవి 2018 ఒప్పందానికి విరుద్ధం కావని దక్షిణ కొరియా వివరించింది. అయితే, దీన్ని కవ్వింపు చర్యగా పరిగణించిన ఉత్తర కొరియా సముద్రంలో రెండు కొరియాల మధ్యనున్న తటస్థ మండల జలాల్లోకి సోమవారం 130 ఫిరంగి గుళ్లను పేల్చింది. తిరిగి మంగళవారం 82 ఫిరంగి గుళ్లను ప్రయోగించామని ప్రకటించింది.  


మేం ప్రపంచానికి మార్గం చూపాం

అటవీ నిర్మూలనకు కారణమయ్యే వస్తువుల దిగుమతిని ఐరోపా సంఘం నిషేధించింది. ఈ పనిని ప్రపంచంలోనే తొలిసారిగా మేం చేశాం. ఫ్రాన్స్‌ మార్గం చూపించింది. వాతావరణం, జీవవైవిధ్యానికి సంబంధంచిన పోరు వేగవంతమవుతోంది.

ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు


విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలి

భావప్రకటనా స్వేచ్ఛ రక్షణతో సురక్షితమైన, భద్రమైన డిజిటల్‌ స్పేస్‌ ప్రారంభమవుతుంది. అయితే ఇది అక్కడితో ముగిసిపోదు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి, విజ్ఞాన శాస్త్రానికి నష్టం కలిగిస్తున్న విద్వేష ప్రసంగాలు, బెదిరింపులు, అసత్యాలు వంటివాటిని నిరోధించేందుకు ప్రభుత్వాలు, కంపెనీలు, సోషల్‌ మీడియా వేదికలు బాధ్యత తీసుకోవాలి.

ఆంటోనియో గుటెరస్‌, ఐరాస ప్రధాన కార్యదర్శి


భూగర్భ జలాన్ని పరిరక్షించాలి

భూగర్భ జలం అనేది గ్రామీణులకు నీటిని అందించేందుకు అనువైన మార్గం. ఆ ప్రాంతాల్లో ప్రజలు చెల్లాచెదురుగా ఉంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల వారికి ప్రధాన నీటి ఆధారంగా భూగర్భ జలం ఉంది. అందువల్ల అత్యంత కీలకమైన ఈ వనరును పరిరక్షించుకోవాలి.

యునెస్కో


రోహిణి ఆచార్య లాంటి కుమార్తె ఉండాలి

రోహిణి ఆచార్య లాంటి కుమార్తె ఉండాలి. నిన్ను చూసి గర్వంగా ఉంది. భవిష్యత్తు తరాలకు నువ్వో ఉదాహరణగా నిలుస్తావు.

గిరిరాజ్‌ సింగ్‌, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి (లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయడంపై స్పందిస్తూ..)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని