ఇండోనేసియాలో సహజీవనం నిషేధం

వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందు శృంగారంతోపాటు స్త్రీ, పురుషుల సహజీవనాన్ని నిషేధించేందుకు ఇండోనేసియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.

Published : 07 Dec 2022 04:58 IST

వివాహేతర సంబంధాలకు కఠిన శిక్షలు

జకార్తా: వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందు శృంగారంతోపాటు స్త్రీ, పురుషుల సహజీవనాన్ని నిషేధించేందుకు ఇండోనేసియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ క్రిమినల్‌ కోడ్‌ను మంగళవారం ఇండోనేసియా పార్లమెంటు సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదా సంస్థలను కించపరిచే వ్యాఖ్యలపైనా ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమలులో ఉన్న దైవ దూషణ నిబంధనలకు కొత్త చట్టంతో మరింత విస్తరణ లభించింది. ఇండోనేసియాలో గుర్తింపు పొందిన ఇస్లాం, హిందూయిజం, బుద్ధిజం సహా ఆరు మతాల మూల సిద్ధాంతాల నుంచి ఎవరైనా వైదొలగితే అయిదేళ్ల జైలుశిక్ష విధిస్తారు. పౌరులు మార్క్సిస్టు - లెనినిస్టు సిద్ధాంతాలు అనుసరిస్తే పదేళ్లు.. కమ్యూనిజం విస్తరణకు పాల్పడితే నాలుగేళ్లు జైలుశిక్ష ఉంటుంది. గర్భస్రావాలపై మునుపున్న నిషేధం కొనసాగుతుంది. అయితే.. మహిళలకు ప్రాణాపాయం, అత్యాచారాల వంటి సందర్భాల్లో 12 వారాలలోపు గర్భం తొలగింపునకు అనుమతిస్తారు. భార్య లేదా భర్త లేని వారితో ఎవరైనా శృంగారంలో పాల్గొంటే వ్యభిచారం కింద శిక్షించేవిధంగా చట్టాన్ని రూపొందించారు.

*  కొత్త చట్టంపై దేశాధ్యక్షుడు జోకో విడోడో ఇంకా సంతకం చేయవలసి ఉందని ఉప న్యాయశాఖ మంత్రి ఎడ్వార్డ్‌ ఒమర్‌ షరీఫ్‌ హియారిజ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత చట్టం నుంచి కొత్త చట్టానికి మారడానికి దాదాపు మూడేళ్లు పడుతుందన్నారు. ఇండోనేసియా పౌరులతోపాటు ఇక్కడికి వచ్చే విదేశీయులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశమైన ఇండోనేసియా తీసుకువచ్చిన ఈ చట్టం 2019లోనే ఆమోదం పొందాల్సి ఉండగా.. ప్రజాందోళనలతో ఆలస్యమైంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు