రష్యా వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడి

దక్షిణ రష్యాలోని కుర్స్క్‌ ప్రాంతంలో డ్రోన్‌తో ఓ వైమానిక ప్రాంతంపై జరిగిన దాడిలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

Published : 07 Dec 2022 04:58 IST

కీవ్‌: దక్షిణ రష్యాలోని కుర్స్క్‌ ప్రాంతంలో డ్రోన్‌తో ఓ వైమానిక ప్రాంతంపై జరిగిన దాడిలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుకు సమీపంలోని ఆ ప్రాంతంలో చమురు నిల్వ చేసినచోట నిప్పంటుకుందనీ, దానిని అక్కడి బలగాలు అదుపులోకి తెచ్చాయని స్థానిక గవర్నర్‌ స్తరొవొయ్‌ వెల్లడించారు. డ్రోన్‌ దాడికి తామే పాల్పడినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించలేదు. ‘‘ఇతర దేశాల గగనతలాల్లోకి దేనినైనా ప్రయోగిస్తే, కాస్త అటూఇటూగా గుర్తుతెలియని ప్రతీకార దాడులు జరుగుతూనే ఉంటాయి. భూమి గుండ్రంగా ఉంది కదా’’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుని సలహాదారుడు మిఖాయిల్‌ పొదల్యాక్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అనూహ్య రీతిలో రష్యాపై జరిగిన దాడులు చర్చకు తావిచ్చాయి. దాడులకు గురైన ఒక వైమానిక క్షేత్రంలో.. అణ్వాయుధాలను తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న బాంబర్లు ఉన్నాయి. వ్యూహాత్మక రక్షణ స్థావరాలపై జరుగుతున్న దాడులు రష్యా గగనతల రక్షణ వ్యవస్థల సమర్థతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక ఇదొక భారీ వ్యూహాత్మక వైఫల్యంగా రష్యా పరిగణించే అవకాశం ఉందని బ్రిటన్‌ రక్షణ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా ముమ్మర దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. 

* యుద్ధంతో ప్రాణనష్టం సహా తాము అనేక విధాలుగా బాధలు పడుతుంటే భారత్‌ మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతులకు దీనిని ఒక సదావకాశంగా వినియోగించుకుంటోందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా ఒక టీవీ ఛానల్‌ ముఖాముఖిలో విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని