సంక్షిప్త వార్తలు(2)

కొవిడ్‌ వ్యాధి శ్వాసకోశంతోపాటు కొవ్వు కణజాలాన్నీ, జ్ఞాపక, గ్రహణ శక్తులనూ నష్టపరుస్తుందని పరిశోధకులు నిర్ధారించారు.

Updated : 08 Dec 2022 06:03 IST

జ్ఞాపకశక్తిపై కొవిడ్‌ ప్రభావం

హల్‌: కొవిడ్‌ వ్యాధి శ్వాసకోశంతోపాటు కొవ్వు కణజాలాన్నీ, జ్ఞాపక, గ్రహణ శక్తులనూ నష్టపరుస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. వ్యక్తులు కొవిడ్‌ నుంచి బయటపడిన తరవాత కూడా దినదినం పనిచేయడానికి కావలసిన స్వల్పకాలిక జ్ఞాపక శక్తి వారిలో నెలల తరబడి క్షీణిస్తున్నట్లు బ్రిటన్‌లోని యార్క్‌, హల్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు తేల్చారు. మతిమరుపు, అయోమయం ఆవహించడం, మానసిక స్పష్టత, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాల వల్ల వారి మెదడుపై మబ్బు కమ్మిన అనుభూతిని పొందుతున్నారని వివరించారు. దీన్ని ‘బ్రెయిన్‌ ఫాగ్‌’గా వ్యవహరిస్తున్నారు. పఠనం, ఇతరులతో సంభాషించడం, దైనందిన జీవితంలో, వృత్తిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వంటివాటికి మనం స్వల్పకాలిక జ్ఞాపకశక్తిపై ఆధారపడతాం. ఈ తరహా జ్ఞాపక శక్తి తగ్గితే వ్యక్తి దినసరి జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.


కొవ్వులో కరోనా వైరస్‌ తిష్ఠ

వాషింగ్టన్‌: నడుము మడతల్లో చర్మం కింద పేరుకునే కొవ్వు కన్నా కాలేయం, చిన్న పేగులు, వంటి అంతర్గత అవయవాల్లో పేరుకున్న కొవ్వు తీవ్ర కొవిడ్‌ కలిగిస్తుందని అమెరికాలోని సావో పాలో, క్యాంపినాస్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్‌ను కలిగించే సార్స్‌-కోవ్‌ 2 వైరస్‌ కొవ్వు కణజాలంలోకి ప్రవేశిస్తుందని 2020 జులైలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా కనుగొన్నది- క్యాంపినాస్‌ విశ్వవిద్యాలయ బృందమే. మానవ దేహంలో కొవ్వు కణాలు ఇంధన వనరుగా ఉపయోగపడతాయి. ఈ కణజాలాన్ని ఎడిపోసైట్స్‌ అంటారు. ఎడిపోసైట్స్‌ పైపొరలోని ఏస్‌ 2 ప్రోటీన్‌కు వైరస్‌ అతుక్కుంటుంది. కొవ్వు కణాలతో వైరస్‌ తన పైపొరను తయారుచేసుకుంటుంది. ఆ కణాల నుంచి శక్తిని పొందుతుంది. అంతర్గత అవయవాల చుట్టూ పేరుకున్న కణజాలంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించగానే దాన్ని ఎదుర్కోవడానికి కొవ్వు కణాలు వాపును కలిగించే సైటోకైన్లను పెద్దఎత్తున విడుదల చేస్తాయి. అదే తీవ్ర కొవిడ్‌కు కారణమవుతుంది.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని