ఇరాన్‌లో 1,200 మంది విద్యార్థులపై విషప్రయోగం!

ఇరాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఒక్కరోజే అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వమే వారిపై విషప్రయోగం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

Published : 08 Dec 2022 05:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఒక్కరోజే అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వమే వారిపై విషప్రయోగం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆందోళన చేస్తామని విద్యార్థులు ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు విషప్రయోగం జరగడం గమనార్హం. ఈ మేరకు మంగళవారం ఆహారం తిన్న తర్వాత దాదాపు 1,200 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖరాజమీ, ఆర్క్‌ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు వర్సిటీల్లో విద్యార్థులు వీరిలో ఉన్నారు. వాంతులు, తీవ్రమైన నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో వారంతా బాధపడ్డారు. విద్యార్థులపై విషప్రయోగం జరిగిందని ది నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. విశ్వవిద్యాలయ కెఫెటేరియాల్లో ఆహారం తినకూడదని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. అధికారులు మాత్రం నీటిలో కలుషిత బ్యాక్టీరియా కారణంగా ఇలా జరిగిందని చెబుతున్నారు. మరోవైపు, ఉన్నట్టుండి చాలా వైద్యశాలలు మూతపడ్డాయి. బాధితులు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. డీహైడ్రేషన్‌ చికిత్సకు అవసరమైన ఔషధాల కొరత ఏర్పడింది. నైతిక పోలీసు విభాగాన్ని తొలగిస్తున్నామని ఇరాన్‌ ప్రాసిక్యూటర్‌ జాఫర్‌ మోంటజెరి ప్రకటన వెలువడిన తర్వాత కూడా దేశంలో ఆందోళనలు కొనసాగడం విశేషం. ఆయన మాట అధికారికంగా చెల్లుబాటవుతుందా? అన్న అంశంపై స్పష్టత లేదు. మరోవైపు అంతర్జాతీయ రాక్‌ క్లైంబింగ్‌ పోటీల్లో హిజాబ్‌ ధరించకుండా పాల్గొన్న ఇరాన్‌ క్రీడాకారిణి ఎల్నాజ్‌ రెకబీ ఇంటిని అధికారులు ధ్వంసం చేశారు. ఇరాన్‌లో నైతిక పోలీస్‌ విభాగాన్ని రద్దు చేసిన మర్నాడే ఈ వార్త వెలువడడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు