Georgia Airline: అధ్యక్షురాలిపైనే నిషేధం విధించిన ఎయిర్‌వేస్‌

జార్జియా అధ్యక్షురాలు (Salome Zourabichvili) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా జార్జియన్‌ ఎయిర్‌వేస్‌ నిషేధం విధించింది.

Published : 22 May 2023 01:58 IST

టిబిలిసి: జార్జియాకు చెందిన విమానయాన సంస్థ జార్జియన్‌ ఎయిర్‌వేస్‌ (Georgian Airways) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా ఆ దేశ అధ్యక్షురాలు శాలోమ్‌ జౌరాబిష్‌విలి (Salome Zourabichvili)పైనే నిషేధం విధించింది. రష్యాకు విమాన సర్వీసులు పునరుద్ధరించడంపై అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా సదరు విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

జార్జియాతో విమాన సర్వీసులపై నాలుగేళ్లపాటు నిషేధం విధించిన రష్యా (Russia) ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా రష్యాకు వచ్చే జార్జియన్ల వీసా పరిమితులపై సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జార్జియా అధ్యక్షురాలు శాలోమ్‌ జౌరాబిష్‌విలి.. రష్యా చొరవను అడ్డుకోవాలని తమ పౌరులకు సూచించారు. మాస్కోపై విధిస్తున్న ఆంక్షలను పాటించాలని అమెరికా, ఈయూ చేస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా రష్యా ప్రతిపాదనకు లొంగవద్దని ఆమె పిలుపునిచ్చారు. వీటిని లెక్కచేయని జార్జియన్‌ ఎయిర్‌వేస్‌ విమానం.. మాస్కోకు బయలుదేరింది. దీనిపై స్పందిస్తూ ఆ విమానంలో ప్రయాణించనని అధ్యక్షురాలు పేర్కొన్నారు. ఇలా అధ్యక్షురాలు హెచ్చరికలపై జార్జియన్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకురాలు తమాజ్‌ డయాస్‌విలి స్పందించారు. జార్జియన్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పేంతవరకు అధ్యక్షురాలిని తమ విమానాల్లో అనుమతించబోమని, నిషేధం విధిస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు రష్యాతో తమ సంబంధాలను మెరుగుపరచుకునేందుకు జార్జియా కొంతకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత మాస్కోపై ఆంక్షలు విధించేందుకూ నిరాకరించింది. దీంతో జార్జియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ.. విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. దీన్ని జార్జియా ప్రభుత్వం తరఫున అధికారులు స్వాగతించగా.. కొందరు జార్జియన్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంతో అధ్యక్షురాలు శాలోమ్‌ జౌరాబిష్‌విలి సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. రష్యాతో సంబంధాలు పెంచుకోవడం ఈయూలో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న తమకు ఏదో ఒకరోజు ప్రమాదకరంగా మారుతాయని శాలోమ్‌ జౌరాబిష్‌విలి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని