Ukraine conflict: పదవి ఊడగొట్టిన ప్రసంగం..!

నోటి దురద జర్మనీ నేవీ చీఫ్‌ పదవిని ఊడగొట్టింది. ఐరోపా సమాఖ్య విధానానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పదవికి రాజీనామా చేయించారు. జర్మనీ

Published : 24 Jan 2022 02:01 IST

 రాజీనామా చేసిన జర్మనీ నేవీ చీఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: నోటి దురద జర్మనీ నేవీ చీఫ్‌ పదవిని ఊడగొట్టింది. ఐరోపా సమాఖ్య విధానానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పదవికి రాజీనామా చేయించారు. జర్మనీ నావికాదళం చీఫ్‌ కే అచిమ్‌ షాన్‌బాక్‌ నిన్న భారత్‌లోని న్యూదిల్లీలో ఉన్న మనోహర్‌ పారేకర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలసిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వాస్తవానికి ఉక్రెయిన్‌లో చిన్న భూభాగాన్నే రష్యా కోరుకుంటోందా..? ఇదంతా ఓ చెత్త.. పుతిన్‌ కేవలం ఒత్తిడి మాత్రమే పెంచవచ్చు.. తలుచుకుంటే ఐరోపా సమాఖ్య లో అభిప్రాయ భేదాలు సృష్టించగలడన్న విషయం కూడా అతనికి తెలుసు. అతను నిజంగా గౌరవం కోరుకుంటున్నాడు. నన్నడిగితే అతన్ని గౌరవించడం తేలిక.. అతను గౌరవానికి అర్హుడు. రష్యా పురాతనమైన, ముఖ్యమైన దేశం’’ అని వ్యాఖ్యానించాడు.  

జర్మనీ నావికాదళం చీఫ్‌ కే అచిమ్‌ అక్కడితో ఆగలేదు.. ‘‘భారత్‌, జర్మనీలకు రష్యా అవసరం ఉంది. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఈ పెద్దదేశం చాలా అవసరం. అది ప్రజాస్వామ్యం కాకపోయినా సరే.. ద్వైపాక్షిక భాగస్వామిగా అవసరం. వారికి ఒక అవకాశం ఇద్దాం. చైనా నుంచి రష్యాను దూరంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే చైనాకు రష్యా వనరులు కావాలి’’ అని పేర్కొన్నాడు. దీంతోపాటు ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరేందుకు అవసరమైన ప్రమాణాలను అందుకోలేదని వ్యాఖ్యానించారు.  

ఐరోపా సమాఖ్యలో కీలక భాగస్వామి అయిన జర్మనీ విధానాలకు అచిమ్‌ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకం. వాస్తవానికి రష్యాతో జర్మనీ సైనిక ఘర్షణ కోరుకోవడం లేదు. కానీ, ఐరోపా సమాఖ్యను కాదని రష్యాకు మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కే అచిమ్‌ వ్యాఖ్యలు ఐరోపా మిత్రుల్లో అనుమానాలు పెంచాయి. దీంతో వెంటనే జర్మనీ నష్ట నివారణ చర్యలకు దిగింది. వైస్‌ అడ్మిరల్‌ కే అచిమ్‌ చేత నావికాదళ చీఫ్‌ పదవికి రాజీనామా చేయించింది. ఈ విషయాన్ని జర్మనీ రక్షణశాఖ ప్రతినిధి ధ్రువీకరించారు. వైస్‌ అడ్మిరల్‌ తక్షణం తన పదవిని వీడారు అని పేర్కొన్నారు. అతని వ్యాఖ్యలతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. 

ఉక్రెయిన్‌ అంశంపై అమెరికా, రష్యాల మధ్య పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఈ రెండు దేశాల మధ్య భద్రతాపరంగా చెలరేగిన అతిపెద్ద సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది సైనికులను మోహరించిన రష్యా తదుపరి వ్యూహం పశ్చిమ దేశాలకు అంతుచిక్కడం లేదు. మరోవైపు ఈ ప్రాంతంలో మరిన్ని సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన రష్యా.. వేడిని రాజేసింది. కరీబియన్‌ ప్రాంతంలో సైనిక మోహరింపులనూ కొట్టిపారేయలేమని పేర్కొంది. అమెరికా, దాని మిత్రపక్షాలను వ్యతిరేకించే నేతలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చర్చలు జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని