Ukraine Crisis: జర్మనీలో రాజకీయ అవసరాల కోసం ‘Z’ గుర్తువాడితే నేరం..!

రష్యా బలగాలు ఉక్రెయిన్‌ ఆక్రమణ సమయంలో వాహనాలపై ఆంగ్ల అక్షరం ‘Z’(జెడ్‌)ను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ కీలక నిర్ణయం తీసుకొంది.

Published : 29 Mar 2022 14:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా బలగాలు ఉక్రెయిన్‌ ఆక్రమణ సమయంలో వాహనాలపై ఆంగ్ల అక్షరం ‘Z’(జడ్‌)ను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ కీలక నిర్ణయం తీసుకొంది. ‘Z’ గుర్తును వినియోగించడం అంటే.. రష్యా అక్రమణకు మద్దతు ప్రకటించడమేనని తేల్చింది. ఉక్రెయిన్‌పై మాస్కో ఆక్రమణ ఏ విధంగా నేరపూరిత చర్యో.. దానికి మద్దతు తెలపడం కూడా అంతే నేరపూరిత చర్యగా జర్మనీ ఇంటీరియర్‌ మినిస్టర్‌ ప్రతినిధి మారెక్‌ వేడ్‌ బెర్లిన్‌లో తెలిపారు.

ఇప్పటికే జర్మనీలోని 16 రాష్ట్రాల్లో కనీసం మూడు చోట్ల ఈ మేరకు చట్టాలు చేశారు. వీటి ప్రకారం రాజకీయ అవసరాల కోసం ఎవరైనా  ‘Z’ గుర్తును వాడితే విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత వారం జర్మనీలోని బవారియన్‌ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జార్జి ఐసన్‌రెచ్‌  మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ చట్టాల అతిక్రమణకు, యుద్ధోన్మాదానికి బహిరంగంగా మద్దతు తెలిపితే విచారణ ఎదుర్కోవాల్సిందే’’ అని హెచ్చరించారు. నాజీలకు సంబంధించిన గుర్తులను వాడటంపై నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

రష్యా బలగాలు ‘Z’ గుర్తును వాడుతుండటంతో ఆ దేశంలో పలు చోట్ల సైన్యానికి మద్దతు లభిస్తోంది. ఇందుకోసం రష్యన్లు ఇళ్లపై, టీషర్టులపై, బిల్‌ బోర్డులపై, కార్లపై  ఈ గుర్తును వాడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని