Covaxin: జర్మనీ వెళ్లేవారికి ఊరట.. కొవాగ్జిన్‌ తీసుకున్న వారికి అనుమతి

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాక్సిన్‌కు జర్మనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Published : 26 May 2022 16:35 IST

జూన్‌ 1 నుంచి అమలులోకి వస్తుందన్న జర్మనీ రాయబారి

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌కు జర్మనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని భారత్‌లోని జర్మనీ రాయబారి వాల్టర్‌ జే లిండ్నర్‌ వెల్లడించారు. దీంతో కొవాగ్జిన్‌ టీకా తీసుకొని జర్మనీ వెళ్లాలనుకునే ప్రయాణికులకు మార్గం సుగమమయ్యింది. జూన్‌ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.

‘ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన కొవాగ్జిన్‌ టీకాను తీసుకున్న ప్రయాణికులను అనుమతించాలని జర్మనీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 1 నుంచి ఇది మొదలు కానుంది. ఇందుకోసం మా రాయబార కార్యాలయం తీవ్ర కృషి చేసింది. ఎందుకంటే కరోనా వల్ల వీసా సెలక్షన్‌ దరఖాస్తులు పేరుకుపోవడంతో ఇందుకు సుదీర్ఘ సమయం పడుతోంది. దయచేసి ఓపిక పట్టండి’ అని భారత్‌లోని జర్మనీ రాయబారి వాల్టర్‌ జే లిండ్‌నెర్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ను ఎదుర్కొనే కొవాగ్జిన్‌ టీకా ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (EUL)కు గతేడాది నవంబర్‌లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. దీంతో ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా వంటి దేశాలు కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న ప్రయాణికులను అమతిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జర్మనీ కూడా కొవాగ్జిన్‌ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని