Germany recession: ఆర్థిక మాంద్యంలోకి జర్మనీ
తీవ్ర ద్రవ్యోల్బణాన్ని (Inflation) చవిచూస్తున్న జర్మనీ.. ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని పేర్కొంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలపై ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో (Largest Economy) నాలుగో స్థానంలో ఉన్న జర్మనీపైనా (Germany) దీని ప్రభావం పడింది. కొంతకాలంగా అక్కడ కొనసాగుతోన్న అధిక ద్రవ్యోల్బణం (Inflation), ఇంధన సంక్షోభం వంటి పరిస్థితులతో జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి (Recession) జారిపోతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తాజా నివేదికను జర్మనీ గణాంక విభాగం గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) 0.3శాతం పడిపోయినట్లు వెల్లడించింది. 2022 నాలుగో త్రైమాసికంలోనూ 0.5శాతం క్షీణత కనిపించింది. ఈఏడాది వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని అంచనా వేసిన తరుణంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. ఇలా వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురైతే దానిని మాంద్యంగా (Recession) నిర్వచిస్తారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం, పారిశ్రామిక ప్రగతి మందగించడం, కఠినమైన ద్రవ్యపరపతి విధానంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు వంటివి బలహీన ఆర్థిక వ్యవస్థకు కారణంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
తాజా గణాంకాల ప్రకారం, గత రెండు త్రైమాసికాల్లో జర్మనీ వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం 1.2 శాతం తగ్గిపోయింది. ప్రభుత్వం చేసే ఖర్చుల్లోనూ 4.9 శాతం తగ్గుదల కనిపించింది. గతేడాది చివర్లో ఆశించినమేర పెట్టుబడులు రానప్పటికీ ఈ ఏడాది త్రైమాసికంలో కొంత మెరుగుపడ్డాయి. అంతకుముందుతో పోలిస్తే మెషినరీ, ఎక్విప్‌మెంట్‌లలో పెట్టుబడులు 3.2శాతం పెరగగా.. నిర్మాణరంగంలోనూ 3.9శాతం పెట్టుబడులు పెరిగాయి. దిగుమతుల్లో 0.9శాతం క్షీణత కనిపించగా.. వాణిజ్యం, ఎగుమతుల్లో 0.4శాతం వృద్ధి దోహదం చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే, మాంద్యం నుంచి తప్పించుకునే అవకాశం లేనప్పటికీ ఈ ఏడాది మొదట్లో కాస్త పురోగతి కనిపించడం ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనడానికి సంకేతం అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
ఆర్థికమాంద్యం నిర్వచనంపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ.. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురైతే దానిని మాంద్యంగా పరిగణిస్తున్నారు. ఈ మాంద్యం కొనసాగే సమయంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రజల ఆదాయం తగ్గడంతో కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా చూపిస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Gulf countries: ఇకపై తక్కువ ఖర్చుతో గల్ఫ్ ప్రయాణం!
-
Politics News
హెడ్లైన్స్ కోసమే నీతీశ్ అలా చేస్తున్నారు.. విపక్షాల ఐక్యత కుదిరే పనేనా?: సుశీల్ మోదీ
-
Sports News
MS Dhoni: ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతం
-
India News
Gold Smuggling: ఆపరేషన్ గోల్డ్.. నడి సంద్రంలో 32 కేజీల బంగారం సీజ్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers Protest: రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.. రైతు సంఘాలు