Italy: అటు విధులు.. ఇటు మాతృత్వపు బాధ్యతలు.. పార్లమెంట్‌లో బిడ్డకు పాలిచ్చిన ఎంపీ

ఇటలీ(Italy) పార్లమెంట్‌లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. మహిళా చట్టసభ సభ్యురాలు సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటున్నారు. 

Published : 08 Jun 2023 20:07 IST

రోమ్‌: ఒకవైపు వృత్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు మాతృత్వాన్ని ఆస్వాదించారు ఇటలీ(Italy)కి చెందిన పార్లమెంటేరియన్‌  గిల్దా స్పోర్టియెల్లో(Gilda Sportiello). ఆమె దిగువ సభలో రోజుల వయస్సున్న తన బిడ్డకు పాలుపట్టారు. మాతృత్వం వల్ల ఉద్యోగ జీవితంలో మహిళలు వెనకడుగు వేయకూడదనే ఉద్దేశంతో, అదే సమయంలో తన బాధ్యతలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆమె వ్యవహించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఆ దేశ పార్లమెంట్‌లో ఈ తరహా పరిణామం చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. 

బుధవారం గిల్దా(Gilda Sportiello) పార్లమెంట్‌లో ఒక బిల్లుకు సంబంధించిన ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత వెనక బెంచిలకు వెళ్లి తన బిడ్డకు పాలుపట్టారు. పురుషాధిక్య ఇటలీ సమాజంలో పార్లమెంట్‌లో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అన్ని పార్టీల మద్దతుతో ఇలా జరగడం ఇది మొదటిసారి. ఆ చిన్నారి స్వేచ్ఛ, శాంతయుత వాతావరణంలో జీవించాలని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు కాస్త నిశ్శబ్దంగా ఉంటాం’అని అన్నారు.  గిల్దా.. ఫైవ్‌ స్టార్ మూవ్‌మెంట్ పార్టీ సభ్యురాలు. పార్లమెంట్ సమావేశాల సమయంలో మహిళలు తమ పిల్లలకు పాలిచ్చే నిబంధన తీసుకురావడం కోసం పోరాడిన వ్యక్తి ఆమె. 

‘చాలామంది తల్లులు తమ వృత్తిగత బాధ్యతలు నిర్వహించేందుకు పిల్లలకు పాలుపట్టడాన్ని మానాల్సి వస్తోంది. ఈ రోజు నుంచి ఇటలీలోని సంస్థలు ఉద్యోగినులకు ఈ తరహా అనుమతి ఇస్తే.. ఏ రంగంలోని మహిళ అయినా తన హక్కును కోల్పోదు’అని గిల్దా ఓ వార్తాసంస్థతో వ్యాఖ్యానించారు. 

మహిళా చట్టసభ సభ్యులు పిల్లలతో పార్లమెంట్‌ సమావేశాల సమయంలో సభలోనే, ఒక సంవత్సరంలోపు వారికి పాలు పట్టడానికి గత ఏడాది పార్లమెంటరీ ప్యానెల్ అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గత ఏడాది అక్టోబర్‌లో జార్జియా మెలోనీ ఇటలీకి మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు.ఇక, 13 సంవత్సరాల క్రితం ఫోర్జా ఇటాలియా పార్టీకి చెందిన లిసియా రొంజల్లి.. స్ట్రాస్‌బర్గ్‌లోని యూరోపియన్ పార్లమెంట్‌లో తన బిడ్డకు పాలిచ్చి విధి నిర్వహణలోనూ తల్లిగా తన బాధ్యత నిర్వర్తించారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని