కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. ఆ మందులను రీకాల్‌ చేసిన భారత కంపెనీ

భారత్‌కు చెందిన కంటి చుక్కల (Eye Drops) మందు కారణంగా అమెరికాలో కొందరికి కంటిచూపు పోయింది. ఓ మరణం కూడా సంభవించింది. దీంతో ఆ మందులను కంపెనీ రీకాల్‌ చేసింది.

Updated : 04 Feb 2023 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌కు చెందిన దగ్గు మందు కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడం తీవ్ర కలకలం రేపిన వేళ.. మన దేశానికి చెందిన మరో ఔషధంలో నాణ్యతా లోపం బయటపడింది. భారత్‌కు చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తయారు చేసిన ఎజ్రీకేర్‌ కంటి చుక్కల మందు కారణంగా అమెరికా (America)లో పలువురికి కంటిచూపు మందగించడమే గాక.. ఓ మరణం కూడా సంభవించింది. దీంతో ఆ మందుపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే అమెరికా విపణి నుంచి ఆ కంటి చుక్కలను (Eye Drops) రీకాల్‌ చేసుకుంటున్నట్లు భారత కంపెనీ వెల్లడించింది.

ఎజ్రీకేర్‌ (EzriCare) కంటి చుక్కల కారణంగా 12 రాష్ట్రాల్లో కనీసం 55 మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని అమెరికా నిన్న ప్రజలను హెచ్చరించింది. ఇందులో ఒకరు ఇన్ఫెక్షన్‌ కారణంగా మరణించగా.. మరో ఐదుగురికి కంటిచూపు పోయిందని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ (CDC) అధికార ప్రతినిధి చెప్పారు. ‘‘న్యూయార్క్‌, వాషింగ్టన్‌తో పాటు మరో 10రాష్ట్రాల్లో పలువురు కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా (Bacteria) వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ కనిపించింది’’ అని సీడీసీ తెలిపింది. ఈ క్రమంలోనే ఎజ్రికేర్‌, డెల్సామ్‌ కంటి చుక్కల కొనుగోళ్లు, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA).. వైద్యులు, వినియోగదారులను హెచ్చరించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ (Global Pharma Healthcare) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఎజ్రీకేర్‌, ఎల్‌ఎల్‌సీ, డెల్సామ్‌ ఫార్మా పంపిణీ చేసిన ఆర్టిఫిషియల్‌ టియర్స్‌ లూబ్రికాంట్‌ కంటి చుక్కల మందు సీసాలను మార్కెట్‌ నుంచి స్వచ్ఛందంగా రీకాల్‌ చేస్తున్నాం. ఈ మందు కలుషితమయ్యే అవకాశాలున్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని సంస్థ వెల్లడించింది. మరోవైపు అమెరికా (US) సీడీసీ కూడా ఈ మందును పరీక్షిస్తోంది.

ఇటీవల భారత్‌కు చెందిన దగ్గు మందుల (cough syrups) కారణంగా గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. నోయిడాకు చెందిన మరియన్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన ‘డాక్‌-1 మాక్స్‌’ సిరప్‌ తాగిన పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్లు ఇటీవల ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. 21 మంది పిల్లల్లో 18 మంది చనిపోయారని ప్రకటించింది. కాగా, వైద్యుల సూచన లేకుండా ఎక్కువ మోతాదులో దానిని తీసుకోవడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. అంతకుముందు హరియాణాలోని సొనెపట్‌ కేంద్రంగా పనిచేసే ‘మైడెన్‌ ఫార్మా’ కంపెనీ ఉత్పత్తి చేసిన సిరప్‌ల వల్ల గాంబియాలో 66 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు