Gotabaya Rajapaksa: ‘గొటా.. గో హోం’.. పార్లమెంటులో శ్రీలంక అధ్యక్షుడికి చేదు అనుభవం!

శ్రీలంక(Sri lanka) అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Gotabaya Rajapaksa)కు చేదు అనుభవం ఎదురైంది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభాని(Economic Crisis)కి కారణమయ్యారన్న...

Published : 06 Jul 2022 02:28 IST

మధ్యలోనే పార్లమెంటును వీడిన వైనం

కొలంబో: శ్రీలంక(Sri lanka) అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Gotabaya Rajapaksa)కు చేదు అనుభవం ఎదురైంది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభాని(Economic Crisis)కి కారణమయ్యారన్న విపక్ష సభ్యుల నినాదాల నడుమ ఆయన మధ్యలోనే పార్లమెంటును వీడారు. కొంతమంది పార్లమెంటేరియన్లు ప్లకార్డులు పట్టుకుని ‘గొటా.. గో హోం’ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వీడియోను స్థానిక ఎంపీ హర్ష డిసిల్వా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. దీన్ని దేశ చరిత్రలోనే ఇప్పటివరకు జరగని పరిణామంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గొటబాయ తన సహాయకులతో మాట్లాడి, సభ నుంచి లేచి వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘అయ్యో! శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ పార్లమెంటుకు రాక ఈ విధంగా ముగిసింది. ఆయన మధ్యలోనే సభను వీడాల్సి వచ్చింది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అంటూ ఎంపీ హర్ష ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

ఈ ద్వీప దేశం కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ద్రవ్యోల్బణం సైతం భారీగా పెరిగింది. ఇంధన సంక్షోభం ముదిరింది. శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే, వచ్చే ఏడాది చివరి వరకు దేశంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుందని ప్రధాని రణిల్ విక్రమసింఘే నేడు పార్లమెంటులో చెప్పారు. ఐఎంఎఫ్‌తో కొనసాగుతున్న బెయిల్‌ ఔట్‌ చర్చలు.. ఆగస్టు నాటికి రుణ పునర్నిర్మాణ ప్రణాళికను ఖరారు చేయడంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. దివాలా తీసిన దేశంగా ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని