Srilanka: బ్యాంకాక్‌లో గొటబాయ.. 24న శ్రీలంకకు తిరిగొచ్చేస్తున్నారట!

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో దేశం విడిచి వెళ్లిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.....

Published : 18 Aug 2022 02:09 IST

కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో దేశం విడిచి వెళ్లిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స వచ్చే వారం స్వదేశానికి తిరిగి రానున్నారు. ఆగస్టు 24న ఆయన శ్రీలంకకు తిరిగి వస్తారని గొటబాయ రాజపక్స కుటుంబ సభ్యుడు ఉదయంగ వీరతుంగ వెల్లడించారు. ఆయన తనతో ఫోన్‌లో మాట్లాడారని.. వచ్చే వారం శ్రీలంకకు వస్తానని చెప్పినట్టు తెలిపారు. 2006 నుంచి 2015 వరకు రష్యాలో శ్రీలంక రాయబారిగా పనిచేసిన వీరతుంగ.. గొటబాయ రాజపక్స ఇక రాజకీయ పదవుల కోసం మళ్లీ ఎన్నిక కాబోరన్నారు. గతంలో మాదిరిగానే దేశానికి ఆయన కొంత సేవ చేస్తారంటూ చెప్పుకొచ్చారు. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ దేశం విడిచి తొలుత మాల్దీవులకు వెళ్లిన  గొటబాయ ఆ తర్వాత సింగపూర్‌కి.. అక్కడి నుంచి నేరుగా ఛార్టర్డ్‌ విమానంలో బ్యాంకాక్‌ (థాయిలాండ్‌) చేరుకొని అక్కడే  ఓ హోటల్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.

అయితే, భద్రత కారణాల రీత్యా లోపలే ఉండాలని, బయటకు రావొద్దని అక్కడి పోలీసులు గొటబాయకు స్పష్టం చేశారు. థాయిలాండ్‌లో ఉన్నంతకాలం అదే హోటల్‌లో ఉండొచ్చని అధికారులు ఆయనకు చెప్పినట్లు బ్యాంకాక్‌ పోస్ట్‌ పత్రిక ఇటీవల తన కథనంలో పేర్కొంది. సింగపూర్‌లో తన వీసా గడువు తీరిపోయిన రోజునే గొటబాయ బ్యాంకాక్‌కు చేరుకున్నారు. మరో దేశంలో శాశ్వతంగా ఆశ్రయం పొందేవరకు (దాదాపు నవంబర్‌ వరకు) ఆయన థాయిలాండ్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వచ్చేవారమే స్వదేశానికి తిరిగి వచ్చేయాలనుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని