Kim Jong Un: కిమ్‌ను తిడుతూ రాతలు.. హ్యాండ్‌ రైటింగ్‌తో నిందితుడి వెతుకులాట

ఉత్తర కొరియా ప్రస్తుతం తీవ్రమైన ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత, కరవు పరిస్థితులు, వరదల కారణంగా పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో ప్రజలంతా తక్కువ తినాలంటూ దేశాధినేత...

Published : 08 Jan 2022 01:35 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా ప్రస్తుతం తీవ్రమైన ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత, కరవు పరిస్థితులు, వరదల కారణంగా పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో ప్రజలంతా తక్కువ తినాలంటూ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గతంలో ఆదేశాలూ జారీ చేశాడు. అయితే, నీవల్లే జనాలు ఆకలితో మరణిస్తున్నారంటూ కిమ్‌ను తిడుతూ.. ఇటీవల ప్యోంగ్‌చాన్‌ డిస్టిక్‌లోని ఓ అపార్ట్‌మెంట్ గోడపై ప్రత్యక్షమైన గ్రాఫిటీ రాతలు స్థానికంగా కలకలం రేపాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు.. దాన్ని రాసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఎటువంటి ఆధారాలూ విడిచిపెట్టడం లేదు. ఇదే క్రమంలో ఇంటింటికి వెళ్లి వేలాది మంది నివాసితుల చేతిరాత నమూనాలు పరిశీలిస్తున్నారు.

సంబంధిత రాతలను వెంటనే తుడిచేసిన అధికారులు.. ఆ రోజు వీధిలో కదలికలపై స్థానికులను ఆరా తీస్తున్నారు. పోలీసులు సైతం నిందితుడి ఆచూకీ కోసం నగరమంతటా అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై వాసెడా యూనివర్సిటీ ప్రొఫెసర్ షిగెమురా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘ఉత్తర కొరియాలో ఇటువంటి రాతలు కనిపించడం అధికారులకు, సాధారణ ప్రజలకూ షాకింగ్‌గా ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని చాలామంది అంగీకరిస్తారని.. కానీ, బయట చెప్పుకోలేరు’ అని అన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బరువు తగ్గినట్లు కనిపిస్తున్న ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి అధికారులు మాట్లాడుతూ.. ‘అధినేత ఆరోగ్యంగా ఉన్నారు. దేశం కోసం ఆయన తక్కువగా తింటున్నారు’ అని వెల్లడించారని ఓ మీడియా కథనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని