Russia: రష్యాలో ఉగ్రదాడి.. 15 మంది పోలీసుల మృతి!

రష్యాలో సాయుధులైన దుండగులు దారుణానికి ఒడిగట్టారు. చర్చిలు, ప్రార్థనామందిరాలు, పోలీసు అధికారులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఈఘటనలో ఉగ్రవాదులతో సహా 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

Updated : 24 Jun 2024 07:11 IST

మాస్కో: రష్యాలోని డాగేస్థాన్‌లో (Russia Dagestan) సాయుధులైన మిలిటెంట్లు దారుణానికి ఒడిగట్టారు. రెండు చర్చిలు, ఓ యూదుల ప్రార్థనామందిరం, పోలీసుల పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులు సహా పలువురు సామాన్య పౌరులు మరణించినట్లు డాగేస్థాన్‌ గవర్నర్‌ సెర్గీ మెలికోవ్‌ సోమవారం వెల్లడించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు.

మఖచ్‌కల, డెర్బెంట్‌ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామందిరాలను మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను చేపట్టాయి. ఆరుగురు సాయుధులను మట్టుబెట్టాయి. ప్రస్తుతానికి ఆపరేషన్‌ ముగిసినట్లు రష్యా ‘జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ (NAC)’ ప్రకటించింది. ఈ ఘటనను ఉగ్రవాదుల చర్యగా అభివర్ణించింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపింది. ఘటన జరిగిన ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల అధీనంలో ఉన్నట్లు వెల్లడించింది.

ముస్లింలు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో గతంలోనూ సాయుధులు కాల్పులకు తెగబడ్డ సందర్భాలు ఉన్నాయి. డాగేస్థాన్‌లో జూన్‌ 24, 25, 26 సంతాప దినాలుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. దాడికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని