Mexico: దుండగుల కాల్పులు.. మేయర్‌ సహా 20 మంది మృతి!

మెక్సికో (Mexico) మరోసారి కాల్పులతో అట్టుడికింది! ఇక్కడి శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు.

Updated : 06 Oct 2022 22:38 IST

మెక్సికో సిటీ: మెక్సికో (Mexico) మరోసారి కాల్పులతో అట్టుడికింది! ఇక్కడి శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. హత్యకు గురైన వారిలో పట్టణ మేయర్ (Mayor) కాన్రాడో మెండోజా(Conrado Mendoza), ఆయన తండ్రి, మాజీ మేయర్‌ జువాన్ మెండోజా కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం మేయర్ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో వారిపై కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలతో సిటీ హాల్‌ రక్తసిక్తంగా మారింది. తూటాలతో గోడలకు రంధ్రాలు ఏర్పడటం గమనార్హం.

ఈ ఘటనకు బాధ్యత తమదేనంటూ ‘టెకిలెరోస్’ ముఠా ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకువచ్చింది. స్థానికంగా డ్రగ్స్ వ్యాపారం‌, కిడ్నాప్‌లు, దోపిడీలు, అనేక హత్యల్లో ఈ గ్యాంగ్‌ పాత్ర ఉంది. అయితే, అధికారులు ఈ వీడియోను ధ్రువీకరించాల్సి ఉందన్నారు. క్రిమినల్ ముఠాల మధ్య వివాదం నేపథ్యంలోనే ఈ హత్యాకాండ జరిగినట్లు మెక్సికో ప్రజాభద్రతా అధికారి రికార్డో మెజియా చెప్పారు. మేయర్‌ను హతమార్చాలనే లక్ష్యంతోనే వారు భవనం లోపల ప్లాన్‌ ప్రకారం దాడులు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. భద్రతా బలగాలు పట్టణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకుగానూ అంతకుముందే భారీ వాహనాలతో రహదారులను బ్లాక్‌ చేసినట్లు తెలిపారు. 

మేయర్ హత్యపై గెరెరో గవర్నర్‌ ఎవెలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఆర్‌డీ పార్టీ సైతం ఈ ఘటనను ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం సైన్యాన్ని దించింది. ఇదిలా ఉండగా.. బుధవారం క్యూర్నావాకా నగరంలోనూ చట్టసభ్యురాలు గాబ్రియేలా మారిన్‌ను ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఎటెల్లెక్ట్ కన్సల్టోర్స్ వివరాల ప్రకారం.. మెండోజా హత్యతో.. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ పాలనలో మరణించిన మేయర్ల సంఖ్య 18కి చేరగా.. చట్టసభ సభ్యుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని