Afghanistan earthquake: భారత్‌ నుంచి అఫ్గానిస్థాన్‌కు సాయం..

ఉగ్రదాడులు, తాలిబన్ల దెబ్బకే కుదేలైపోయిన అఫ్గానిస్థాన్‌కు భూకంపం రూపంలో మరో విపత్తు వచ్చిపడింది. ఇటీవల భూకంపలో భారీ ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

Updated : 24 Jun 2022 17:16 IST

అఫ్గానిస్థాన్‌లో దయనీయ పరిస్థితి

ఇంటర్నెట్‌డెస్క్‌: భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గానిస్థాన్‌కు భారత్‌ నుంచి మానవతాసాయం అందింది. నిన్నరాత్రి భారత్‌ నుంచి విమానంలో అవసరమైన పరికరాలు, ఇతర సహాయ సామగ్రిని కాబూల్‌కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ట్వీట్‌ చేశారు. దీనిని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ రీట్వీట్‌ చేశారు. ఈ సహాయ సామగ్రితో పాటు ఒక సాంకేతిక బృందం కూడా కాబూల్‌ వెళ్లింది. భూకంపంలో దెబ్బతిన్న అఫ్గాన్‌కు తొలుత సాయం పంపిన దేశం భారత్‌ కావడం విశేషం. భారత్‌ నుంచి వెళ్లిన బృందంలోని సభ్యులు తాలిబన్లతో కలిసి మనవతా సాయం పంపిణీని పర్యవేక్షించనున్నారు. ఈ బృందం అక్కడ ఉన్న భారత దౌత్యకార్యాలయం నుంచి పనిచేయనుంది. దీంతో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. తొలిసారి కాబూల్‌లోని భారత దౌత్యకార్యాలయంలో సిబ్బంది పనిచేస్తున్నట్లైంది. భారత దౌత్య బృంద భద్రతకు తాలిబన్లు పలు మార్లు హామీలు ఇచ్చాక ఈ టెక్నికల్‌ టీమ్‌ అఫ్గానిస్థాన్‌కు వెళ్లింది.

500 మంది క్షతగాత్రులకు 5 పడకలే..!

ఉగ్రదాడులు, తాలిబన్ల దెబ్బకు కుదేలైపోయిన అఫ్గానిస్థాన్‌కు భూకంపం రూపంలో మరో విపత్తు వచ్చిపడింది. ఇటీవల భూకంపంలో భారీ ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కానీ, వారికి తగిన వైద్యసదుపాయాలు కరవయ్యాయి. అఫ్గానిస్థాన్‌లోని జ్ఞాన్‌ అనే గ్రామం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడి వైద్యశాల కూడా నేలమట్టం అయింది. వందల సంఖ్యలో క్షతగాత్రులు వస్తుండగా.. వారికి సేవలు అందించేందుకు ఐదు పడకలు మాత్రమే ఉన్నాయి. ఇక ఆసుపత్రి పరికరాలు మొత్తం దెబ్బతిన్నాయి. ఇక్కడ వైద్య సిబ్బందిలో ఒకరైన గుల్‌.. ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ ‘‘ఇక్కడకు 500 మంది క్షతగాత్రులు రాగా.. వారిలో 200 మంది మరణించారు’’ అని పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని