Australia: ఇన్సూరెన్స్‌ కంపెనీపై సైబర్‌ దాడి.. హ్యాకర్‌ చేతిలో కోటి మంది సమాచారం..!

ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ మెడిబ్యాంక్‌పై హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. వారు డిమాండ్‌ చేసిన డబ్బులు చెల్లించకపోవడంతో తస్కరించిన సమాచారాన్ని డార్క్‌వెబ్‌లో ఉంచారు. సుమారు కోటి మంది సమాచారం హ్యాకర్లు చేతిలో ఉన్నట్లు భావిస్తున్నారు.

Published : 10 Nov 2022 01:24 IST

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోనే (Australia) అతిపెద్ద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీపై హ్యాకర్లు (Hacking) దాడిచేసి వినియోగదారుల సమాచారాన్ని తస్కరించారు. ఆ వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలంటే తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు సదరు కంపెనీ నిరాకరించడంతో వాటిలోని కొంత సమాచారాన్ని డార్క్‌వెబ్‌లో బహిర్గతం చేశారు. వీటిని బీమా సంస్థ ధ్రువీకరించింది. ఆ కంపెనీకి చెందిన కోటి మంది ప్రస్తుత, పూర్వ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లో చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన మెడిబ్యాంక్‌ (Medibank) హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీపై గతనెల హ్యాకర్ల దాడి జరిగింది. ఆ సమయంలోనే పూర్తి సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించినట్లు సంస్థ భావిస్తోంది. అయితే, ఆ వివరాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు భారీ స్థాయిలో నగదు డిమాండ్‌ చేశారు. వాటిని ఇన్సూరెన్స్‌ సంస్థ చెల్లించలేదు. దీంతో వందమందికిపైగా సమాచారాన్ని ‘నాటీ లిస్ట్‌’ పేరుతో డార్క్‌నెట్‌లో విడుదల చేసిన ఓ హ్యాకర్‌.. ఇది శాంపిల్‌ మాత్రమేనని పేర్కొన్నాడు. అందులో హెచ్ఐవీ నిర్ధారణ అయినవారితోపాటు మద్యం, డ్రగ్స్‌కు బానిసలైన వారు, మానసిక ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతోన్న వారి వివరాలు ఉన్నాయి. దీంతో మరింత మంది వినియోగదారుల సమాచారాన్ని  బహిర్గతం చేసే ప్రమాదం ఉందని ఆ సంస్థ అనుమానిస్తోంది.

తమ ఇన్సూరెన్స్‌ (Insurance) కంపెనీకి చెందిన సున్నితమైన వివరాలు బహిర్గతం కావడంపై మెడిబ్యాంక్‌ సీఈఓ డేవిడ్‌ కాక్జ్‌కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యతగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన ఆయన.. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మరోవైపు, ఈ వివరాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి కాకుండా సదరు సంస్థలు చర్యలు చేపట్టాలని ఆస్ట్రేలియా సైబర్‌సెక్యూరిటీ (Cyber Security) మంత్రి క్లేర్‌ ఓ నీల్‌ స్పష్టం చేశారు. ఈయన కూడా మెడిబ్యాంక్‌ కస్టమర్‌ కావడం, హ్యాకింగ్‌కు గురైన జాబితాలో ఆయన ఆరోగ్య సమాచారం కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని