Twitter: ట్విటర్‌పై హ్యాకర్ల పంజా.. అమ్మకానికి 23.5కోట్ల మంది ఈమెయిల్‌ ఐడీలు..!

23.5 కోట్ల మంది ట్విటర్‌ యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగలించి ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచడం కలకలం రేపుతోంది. ఈ డేటా లీక్‌తో భారీ ఎత్తున సైబర్‌ నేరాలు జరిగే ముప్పు పొంచి ఉంది.

Published : 06 Jan 2023 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter) నుంచి పెద్ద ఎత్తున యూజర్ల డేటా లీక్‌ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. సుమారు 23.5కోట్ల మంది ట్విటర్‌ యూజర్ల వ్యక్తిగత డేటా (Personal Data)ను హ్యాకర్లు అపహరించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ హడ్సన్‌ రాక్‌ తెలిపింది. ఈ డేటాను ఆన్‌లైన్‌ హ్యాకింగ్‌ ఫోరమ్‌లో విక్రయానికి ఉంచినట్లు వెల్లడించింది.

‘‘23.5 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత రికార్డులు, ఈమెయిల్‌ ఐడీలకు సంబంధించిన డేటా లీక్‌ (Data Breach) అయ్యింది. దీంతో ఆ ఖాతాలపై భారీ ఎత్తున హ్యాకింగ్‌, ఫిషింగ్ (Phishing)‌, డాక్సింగ్‌ (Doxxing) జరిగే ప్రమాదముంది’’ అని హడ్సన్‌ రాక్‌ సహ వ్యవస్థాపకుడు అలన్‌ గాల్‌ లింక్డ్‌ఇన్‌లో రాసుకొచ్చారు. సుమారు రెండు వారాల క్రితమే ఈ హ్యాకింగ్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ట్విటర్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్విటర్‌ ఎలాంటి చర్యలు చేపట్టిందన్నదానిపై కూడా స్పష్టత లేదు.

ఈ లీక్‌ ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు. అయితే 2021 చివర్లోనే ఈ హ్యాకింగ్‌ జరిగినట్లు సైబర్‌ నిపుణులు భావిస్తున్నారు. ట్విటర్‌ ఏపీఐలో లోపం ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్‌ అపహరించాడని హడ్సన్‌ రాక్‌ తెలిపింది. లీకైన డేటాలో యూజర్ల ఇ-మెయిల్‌, పేరు, యూజర్‌ నేమ్‌, ఫాలోవర్లు వివరాలున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్టులు, ప్రముఖుల ఖాతాల వివరాలు కూడా హ్యాకర్ల (Hackers) చేతికి వెళ్లినట్లు సమాచారం.

ట్విటర్‌ (Twitter)లో పెద్ద ఎత్తున డేటా లీక్‌ అయినట్లు ఇటీవల వార్తలు రాగా.. 40 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ఉంటారని కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఆ సంఖ్యను 23.5 కోట్లుగా పేర్కొంటూ హడ్సన్‌ రాక్‌ తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది. కాగా.. ఈ డేటా లీక్‌పై యూఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌, ఐర్లాండ్‌లోని డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని