Putin SuperYacht: పుతిన్‌ నౌకకు హ్యాకర్ల తాకిడి..!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందినదిగా భావించే ఓ విహార నౌక (Graceful) ను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు.

Published : 01 Mar 2022 02:09 IST

మార్గాల వివరాలను మార్చివేసిన హ్యాకర్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దురాక్రమణను వెంటనే నిలిపివేయాలంటూ అగ్రరాజ్యం అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. అంతేకాకుండా ఆయా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన ఓ లగ్జరీ విహార నౌక (Graceful Yacht)ను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాకుండా ఆ నౌకను ధ్వంసం చేసినట్లు పేర్కొనడంతోపాటు గమ్యం పేరును కూడా మార్చివేశారు. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ జర్నలిస్ట్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వద్ద దాదాపు 100 మిలియన్‌ డాలర్ల విలువైన ఓ విహారనౌక (UBGV8) ఉన్నట్లు చెబుతుంటారు. అయితే, ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న పుతిన్‌ను గందరగోళ పరిచేందుకుగానూ ఆయన నౌకను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ‘గ్రేస్‌ఫుల్‌’ నౌక స్నేక్‌ ఐల్యాండ్‌లో మునిగిపోయినట్లు సమాచారాన్ని మార్చివేశారు. అంతేకాకుండా నౌక గమ్యాన్ని ‘నరకం’ అని పేర్కొన్న హ్యాకర్లు.. UBGV8 పిలిచే ఆ నౌక పేరును FCKPTN అంటూ మార్చివేశారు. సముద్రాల్లో నౌకల మార్గాలను ట్రాక్‌ చేయడానికి వినియోగించే ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను మార్చడం ద్వారా పుతిన్‌ నౌక వివరాలను మార్చినట్లు హ్యాకర్లు పేర్కొనడం గమనార్హం.

ఇదిలాఉంటే, పుతిన్‌కు చెందిన ఈ సూపర్‌నౌకకు సమస్యలు తలెత్తడంతో జర్మనీలోని హాంబర్గ్‌లో మొన్నటివరకు మరమ్మతులు చేశారు. అయితే, ఉక్రెయిన్‌పై దాడికి జరిగే కొన్నిరోజుల ముందే ఈ నౌకను రష్యాలోని కాలినిన్‌గ్రాడ్‌కు తరలించారు. ఈ లగ్జరీ విహారనౌకలో హెలిప్యాడ్‌తోపాటు స్విమ్మింగ్‌ పూల్‌, మసాజ్‌ సెంటర్‌, జిమ్‌, బార్‌, డ్యాన్స్‌ఫ్లోర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఆకృతిలో చిన్నగా కనిపించినప్పటికీ దీనిని విలువ దాదాపు 100 మిలియన్‌ డాలర్లు (రూ.750 కోట్లు) అని అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు