Obesity: 2035 నాటికి.. ప్రపంచంలో సగానికిపైగా ఊబకాయులే..!

ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కొనసాగితే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికిపైగా ప్రజలు ఊబకాయం బారిన పడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ నివేదిక వెలువరించింది.

Published : 03 Mar 2023 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్షణమే సరైన చర్యలు తీసుకోకపోతే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఊబకాయం, అధిక బరువు (Overweight)తో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ (World Obesity Federation) హెచ్చరించింది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకుపైగా ప్రజలు ఈ సమస్య(Obesity)తో ప్రభావితమవుతారని తన తాజా నివేదికలో పేర్కొంది. ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఈ మేరకు భారీ పెరుగుదల నమోదవుతుందని తెలిపింది. ముఖ్యంగా బాలబాలికల్లో ఈ సమస్య అధికంగా ఉంటుందని అంచనా వేసింది.

‘బాలబాలికల్లో ఊబకాయం రేట్లు 2020 నాటితో పోలిస్తే 2035 నాటికి రెట్టింపు అవుతాయి. ఈ సమస్య వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా 4 ట్రిలియన్‌ డాలర్లకుపైగా ప్రభావం పడుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు మూడు శాతానికి సమానం! ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువగా నమోదవుతుందని అంచనా వేసిన 10 దేశాల్లో తొమ్మిది.. ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ లేదా తక్కువ మధ్య ఆదాయ దేశాలే ఉంటాయి’ అని డబ్ల్యూఓఎఫ్‌ తన నివేదికలో పేర్కొంది. బాడీ మాస్ ఇండెక్స్(BMI) ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు వెల్లడించింది.

అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ తగ్గడం, ఆహార సరఫరా, మార్కెటింగ్‌ విధానాల్లో లోపాలు, బరువు నిర్వహణ, ఆరోగ్య విద్యలో తక్కువ వనరులతో కూడిన సేవలు.. ఈ సమస్య పెరుగుదలకు కారణమవుతాయని నివేదిక తెలిపింది. ఊబకాయంపై ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కొని.. తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రొ.లూయిస్ బౌర్ వ్యాఖ్యానించారు. నివేదికలోని అంశాలే దీనికి హెచ్చరిక అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని