Hardeep Singh Nijjar: రవి శర్మ నుంచి రంగులు మార్చిన కేటీఎఫ్‌ చీఫ్‌ నిజ్జర్‌..!

ఖలిస్థాన్ టైగర్‌ ఫోర్స్‌ అధినేత నిజ్జర్‌ ప్రస్థానం మొత్తం అనుమానాస్పదంగానే ఉంది. తొలుత కొన్నేళ్లపాటు అతడికి ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించిన కెనడా.. హఠాత్తుగా అతడి విషయంలో మౌనం పాటించింది. ఈ విషయాన్ని కెనడా పత్రికలే పేర్కొన్నాయి. ఆ తర్వాతే అతడు భారత వ్యతిరేక కార్యకలాపాలను వేగవంతం చేశాడు.  

Updated : 20 Sep 2023 14:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తప్పుడు పాస్‌పోర్టుతో ఓ దేశంలో ప్రవేశించడమే నేరం.. అలాంటి నేరం చేసిన వాడిని అటూఇటూ తిప్పి.. మసిపూసి మారేడుకాయ చేసి సిక్కు ఉద్యమ నేతగా కెనడా (Canada) చెబుతోంది. ట్రూడో చెప్పిన కెనడా పౌరుడు, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత నిజ్జర్‌కు సంబంధించిన కీలక విషయాలు బయటపడుతున్నాయి.

దాదాపు 26 ఏళ్ల క్రితం రవిశర్మ పేరిట పాస్‌పోర్టుతో ఓ వ్యక్తి కెనడాలోని టొరంటోలోకి అడుగుపెట్టాడు. సిక్కు వేర్పాటు వాదంతో సంబంధాలు ఉండటంతో భారత్‌ (India)లోని పంజాబ్‌ పోలీసులు తన కుటుంబాన్ని వేధిస్తున్నారని.. అక్రమ అరెస్టు చేస్తున్నారని అతడు ఆరోపించాడు. తనకు శరణు కల్పించాలని కోరాడు. కానీ, అతడు తప్పుడు ఆధారాలు సమర్పించాడని తెలిసి కెనడా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరస్కరించారు. అతడే హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌.

ఆ తర్వాత నిజ్జర్‌ వెంటనే బ్రిటిష్‌ కొలంబియాకు చెందిన మహిళను వివాహం చేసుకొన్నాడు. ఆమె అతడి ఇమ్మిగ్రేషన్‌ను స్పాన్సర్‌ చేసింది. ఆ సమయంలో దరఖాస్తు పత్రంలో తనకు ఏ సాయుధ గ్రూపుతోనూ సంబంధం లేదని పేర్కొనడం విశేషం. దీంతోపాటు పెళ్లి పత్రిక, ఫొటోలు సమర్పించాడు. కానీ, కెనడా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల్లో అనుమానం మాత్రం పోలేదు. ఎందుకంటే నిజ్జర్‌ను స్పాన్సర్‌ చేసిన మహిళే.. అంతకు ముందు ఏడాది మరో పురుషుడి స్పాన్సర్‌తో కెనడాకు చేరుకొంది.  దీంతో కెనడాలో శరణు కోసం నిజ్జర్‌ వివాహం చేసుకున్నట్లు భావించి అతడి దరఖాస్తును తిరస్కరించారు. కెనడాలోకి తప్పుడు వివరాలతో ప్రవేశించిన అతడు ఆశ్రయం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు.

ఆ తర్వాత అతడు అక్కడి కోర్టుల్లో కూడా అప్పీల్‌ చేసుకొన్నాడు. కానీ, 2001లో కూడా అక్కడి న్యాయస్థానం అతడి అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తర్వత హఠాత్తుగా నిజ్జర్‌ స్వయంగా కెనడా పౌరుడినని చెబుతూ తిరగడం మొదలుపెట్టాడని ఆ దేశ పత్రిక గ్లోబల్‌ న్యూస్‌ కథనంలో పేర్కొంది. నిజ్జర్‌ హత్య తర్వాత ఆ పత్రిక ఆధారాలతో సహా అతడి వ్యవహారాన్ని ప్రచురించింది.

మాజీ ముఖ్యమంత్రి హంతకుడితో చట్టాపట్టాల్‌..

2001 తర్వాత నిజ్జర్‌ అక్కడే ప్లంబింగ్‌ బిజినెస్‌ మొదలుపెట్టాడు. అదే సమయంలోనే వేర్పాటువాది, బబ్బర్‌ ఖల్సా నాయకుడు జగ్‌తార్‌ సింగ్‌ తారతో  పరిచయం పెంచుకొన్నాడు. ఇతడు పంజాబ్‌ మాజీ సీఎం బియాంత్‌ సింగ్‌ హత్యలో మాస్టర్‌ మైండ్‌గా ఉన్నాడు. 2014లో తారను కలుసుకొనేందుకు థాయ్‌లాండ్‌కు నిజ్జర్‌ వెళ్లాడు. జగ్‌తార్‌ సింగ్‌ను థాయిలాండ్‌ నుంచి తప్పించే ప్లాన్‌లో పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సమన్వయం చేసుకొనేందుకు యత్నించాడు. ఈక్రమంలో పాక్‌కు వెళ్లాడు. కానీ, వారి పథకం పారలేదు. అప్పటికే పట్టాయాలోని భారత్ ఇంటెలిజెన్స్‌ బృందాలు చుట్టుముట్టాయి. 2015లో తారను భారత్‌కు తీసుకొచ్చారు.

పంజాబ్‌లో డ్రగ్స్‌ బానిసలను చేరదీసి..

తారను రక్షించే ప్లాన్‌ పారకపోవడంతో అతడు కెనడాకు తిరిగి వెళ్లాడు. అనంతరం అతడు ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌కు నాయకత్వం వహించాడు. పంజాబ్‌లో మాదకద్రవ్యాల బానిసలను తమ గ్రూపులో చేర్చుకొన్నాడు. ఆ తర్వాత వీరితో పంజాబ్‌లో లక్షిత హత్యలు చేయించడం మొదలుపెట్టాడు. మన్‌దీప్‌ సింగ్‌ అనే కేటీఎఫ్‌ సభ్యుడి అరెస్టుతో 2014-16 మధ్యలో నిజ్జర్‌ అరాచకాలు తొలిసారి బయటకు వచ్చాయి. ఆ తర్వాత కొన్నేళ్లుగా అతడు భారత్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2020లో  భారత్‌ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించి 10 లక్షల రివార్డు ప్రకటించింది. 2021లో కమల్‌దీప్‌ శర్మ అనే హిందూ పూజారి హత్యలో అతడు కుట్రదారుడిగా తేలింది. 

జీ20కి ముందే భారత్‌ను నిందించాలని.. కెనడా నాడే భంగపాటుకు గురై..!

ఇటీవల జూన్‌లో కెనడాలో బ్రాప్టన్‌లో ఇందిరాగాంధీ హత్యను పొగుడుతూ ఏర్పాటు చేసిన ‘నగర్‌ కీర్తన్‌’లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. మార్చిలో ఒట్టావలో భారత హైకమిషన్‌లో జరిగిన విధ్వంసంలో కూడా అతడి పాత్ర ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని